
హైదరాబాద్: వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ శనివారం 40వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా గేల్‌కు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో గేల్‌కు సహచర ఆటగాడైన కేఎల్ రాహుల్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు.
గేల్‌ను అభిమానులు ముద్దుగా 'యూనివర్స్ బాస్' అని పిలుచుకునే సంగతి తెలిసిందే. క్రిస్ గేల్ పుట్టినరోజు సందర్భంగా కేఎల్ రాహుల్ "సిగ్గు పడకు బాస్.. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి" అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక, క్రిస్ గేల్‌కు చాహల్ అభినందనలు తెలియజేస్తూ "హ్యాపీ బర్త్ డే అంకుల్" సరదాగా ట్వీట్ చేశాడు. కృనాల్ పాండ్యా తన ట్విట్టర్‌లో "క్రికెట్ లెజెండ్, ఎంటర్‌టైనర్‌కు ఇవే నా శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశాడు. "హ్యాపీ బర్త్‌డే యూనివర్స్ బాస్" అంటూ యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే, క్రిస్ గేల్ ఇప్పటివరకు మొత్తం 462 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 19,321 పరుగులు చేశాడు. ఇటీవలే టీ20ల్లో 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా క్రిస్ గేల్ చరిత్ర సృష్టించాడు. మొత్తం 389 మ్యాచ్‌లు ఆడిన క్రిస్ గేల్ 39.07 యావరేజితో 13,013 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 80 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ ఫార్మాట్‌లో 1000 ఫోర్లు బాదిన తొలి క్రికెటర్ కూడా క్రిస్ గేల్. టీ20ల్లో క్రిస్ గేల్ రికార్డులివే:
మ్యాచ్‌లు - 389
ఇన్నింగ్స్‌లు - 381
పరుగులు - 13,013
యావరేజి - 39.07
అత్యధిక స్కోరు - 175*
100s - 22
50s - 80
6s - 958