|
అసలేం జరిగిందంటే..
మహరాజ్ వేసిన 15వ ఓవర్ చివరి బంతిని రిషభ్ పంత్ మిడ్ వికెట్ మీదుగా ఆడి పరుగు తీసేందుకు ప్రయత్నించాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కేఎల్ రాహుల్.. పంత్ మూమెంట్ ఇవ్వడంతో హాఫ్ పిచ్ ధాటాడు. అయితే బంతిని బవుమా అడ్డుకొని బౌలర్ వైపు విసరడంతో పంత్ ఆగిపోయాడు. పంత్ అనూహ్య చర్యకు అయో మయానికి గురైన రాహుల్ ఆగి బ్యాట్స్‌మన్ ఎండ్‌వైపు పరుగు పూర్తి చేశాడు. అయితే బవుమా విసిరిన త్రోను అందుకోవడంలో మహరాజ్ విఫలమయ్యాడు. దాంతో అలర్ట్ అయిన రాహుల్ మళ్లీ నాన్‌స్ట్రైకర్ వైపు పరుగుతీసాడు. అయితే మహరాజ్‌కు బ్యాకప్‌గా ఉన్న ఫీల్డర్ కూడా బంతిని అందుకోవడంలో తడబడటంతో రాహుల్‌కు కలిసొచ్చింది.

పెద్ద గండం తప్పించుకున్న భారత్..
ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడటంతో రాహుల్, పంత్ ఊపిరి పీల్చుకున్నారు. రాహుల్ అయితే పంత్‌పై కన్నెర్ర చేశాడు. అలా మూమెంట్ ఇచ్చి వెనక్కి తిరగడం ఎంతవరకు సమంజసం అన్నట్లు పంత్‌వైపు ఆగ్రహంగా చూశాడు. ఈ వికెట్ గనుక కోల్పోయి ఉంటే భారత్ పీకల్లోతు కష్టాల్లో పడేది. ఎందుకంటే అంతకుముందే టీమిండియా శిఖర్ ధావన్(29), విరాట్ కోహ్లీ(0) వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్(42 బ్యాటింగ్), శిఖర్ ధావన్(29) శుభారంభాన్ని అందించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసి పటిష్ట స్థితిలో కనిపించింది. కానీ పవర్ ప్లే ముగిసిన వెంటనే టీమిండియా కథ మారింది.

శుభారంభం దక్కినా..
బవుమా స్పిన్నర్లను రంగంలోకి దింపగా.. భారత బ్యాట్స్‌మన్ తడబడ్డారు. దాంతో రన్‌రేట్ తగ్గింది. ఈ క్రమంలోనే మార్కరమ్ బౌలింగ్‌లో డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్‌కు ప్రయత్నించిన శిఖర్ ధావన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 63 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఐదు బంతుల్లోనే ఔటయ్యాడు. కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో తడబడ్డ విరాట్.. అతను వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను కవర్ డ్రైవ్‌కు ప్రయత్నించగా.. ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న బవుమా సునాయసంగా క్యాచ్ పట్టాడు. దాంతో విరాట్ నిరాశగా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన పంత్, రాహుల్ నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకునడిపిస్తున్నారు. 23 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 119 రన్స్ చేసింది.