
ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు హోరాహోరీగా సాగుతోంది. ఆసీస్ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో మంచి పట్టుదల కనబరిచారు. దీంతో ఆ జట్టు కూడా మంచి స్కోరు సాధించింది. అయితే భారత బౌలర్లు కూడా ఈ మ్యాచ్‌లో సత్తా చాటారు. ముఖ్యంగా పేసర్ మహమ్మద్ షమీ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆస్ట్రేలియా టీంలో ప్రమాదకరమైన బ్యాటర్ ట్రావిస్ హెడ్ వికెట్ తీసిన విధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
షమీ వేసిన బంతి ఎడ్జ్ తీసుకొని స్లిప్స్ వైపు దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ చాలా చురుగ్గా స్పందించి ఆ క్యాచ్ పట్టేశాడు. ట్రావిస్ హెడ్ అవుటైన విధానం చూసిన అభిమానులు షమీ బౌలింగ్‌తోపాటు రాహుల్ స్పందించిన తీరును కూడా మెచ్చుకుంటున్నారు. ఇంత స్టన్నింగ్ క్యాచ్ పట్టుకున్నందుకు శభాష్ అంటున్నారు. స్లిప్స్‌లో క్యాచులు పట్టడం ఎప్పుడూ అంత సులభం కాదు. బంతి చాలా వేగంగా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే క్యాచ్ నేలపాలు కావడం ఖాయం.
ఈ క్రమంలోనే రాహుల్ కింద పడిపోతూ చటుక్కున క్యాచ్ అందుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అభిమానులు అతని ఫీల్డింగ్‌ను మెచ్చుకుంటున్నారు. అయితే బ్యాటింగ్‌లో కొంత కాలంగా పేలవ ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను రెండో టెస్టులోనూ ఆడించడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిల్‌ను ఈ మ్యాచులో కూడా పక్కన పెట్టడం వారికి ఏమాత్రం నచ్చలేదు.
దానికితోడు శ్రేయాస్ అయ్యర్ వచ్చాడని సూర్యకుమార్‌ను పక్కన పెట్టడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. తొలి టెస్టులో అరంగేట్రం చేసిన సూర్య విఫలమైన సంగతి తెలిసిందే. అయితే కేవలం ఒక్క మ్యాచ్ అవకాశం ఇచ్చిన తర్వాత అతన్ని పక్కన పెట్టడం కూడా ఫ్యాన్స్‌కు రుచించలేదు. మరి రెండో టెస్టులో అయినా రాణించి జట్టులో తన స్థానం నిలుపుకుంటాడేమో చూడాలి.