
మళ్లీ అదే తప్పిదం..
‘సౌతాఫ్రికా అద్భుతమైన క్రికెట్ ఆడింది. మేం ఫస్ట్ మ్యాచ్ తరహాలోనే తప్పిదాలు చేశాం. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోయాం. జట్టుగా ఈ ఓటమి మాకు ఓ గుణపాఠం. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడటం బాధగానే ఉంది. ఓటమికి జట్టులోని వ్యక్తిగతంగా నిందించలేం.
బిగ్ టోర్నీల్లో రాణించాలంటే మిడిల్ ఓవర్లలో రాణించడం చాలా ముఖ్యం. భాగస్వామ్యాలు నెలకొల్పాలి. అదే విధంగా మిడిల్లో వికెట్లు తీయడంతో పాటు ప్రత్యర్థిపై ఒత్తిడిని పెంచాలి.ఉపఖండం పిచ్ మాదిరే ఉంది. హోమ్ కండీషన్స్‌లో ఆడినట్లే ఉన్నా ప్రభావం చూపలేకపోయాం.

క్రెడిట్ సఫారీలదే..
అయితే ఈ వికెట్‌పై 280 పరుగుల లక్ష్యాన్ని చేధించడం మాములు విషయం కాదు. కానీ వారు సూపర్ బ్యాటింగ్‌తో సునాయసంగా చేధించారు. క్రెడిట్ సౌతాఫ్రికాదే. కీలక భాగస్వామ్యాలతో మాపై ఒత్తిడిపెంచారు. ఈ సిరీస్‌లో సానుకూల అంశాలు ఏమైనా ఉన్నాయంటే.. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ ఫస్ట్ వన్డేలో రాణించడం, రెండో వన్డేలో రిషభ్ చెలరేగడం.
రెండు వికెట్లు కోల్పోయినా తర్వాత అలా ఆడటం అంత సులువైన పనికాదు. జట్టులో అతను కీలక సభ్యుడు. శార్దూల్ బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉందని చెప్పాడు. జస్ప్రీత్ బుమ్రా అసాధారణమైన బౌలర్. అతను తన జోరును కొనసాగించాడు.

చాలా రోజులు అవ్వడంతోనే..
ఓటమి సాకుగా చెప్పడం లేదు కానీ.. వన్డే క్రికెట్ ఆడి చాలా రోజులైంది. దాంతో మా శరీరాలు అడ్జస్ట్ చేసుకోలేకపోయాయి. బబుల్స్‌లో ఉండటం కూడా సవాల్‌గా మారింది. అయితే సవాళ్లు స్వీకరించేందుకు మేం ఎప్పుడూ ముందుంటాం. మూడో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శనతో విజయం కోసం ప్రయత్నిస్తాం. అయితే ఈ మ్యాచ్‌లో మార్పులు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడే టీమ్ కాంబినేషన్ గురించి మాట్లాడలేను'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

వన్డే సిరీస్ సమర్పయామి..
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (71 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 85), రాహుల్ (79 బంతుల్లో 4 ఫోర్లతో 55) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం సౌతాఫ్రికా 48.1 ఓవర్లలో 3 వికెట్లకు 288 పరుగులు చేసి గెలిచింది. జేన్‌మన్ మలాన్ (108 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 91), 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' డి కాక్ (66 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78) తొలి వికెట్‌కు 132 పరుగులు జోడించారు. చివరి మ్యాచ్ ఆదివారం కేప్‌టౌన్ వేదికగా జరుగుతుంది.