
హైదరాబాద్: జీవితంలో ఊహించని ప్రయాణాలు చేయడం సాధారణం అని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఆడబోతున్న కేఎల్ రాహుల్ అన్నాడు. గత పది సీజన్లలో కేఎల్ రాహుల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన సంగతి తెలిసిందే.
బెంగళూరు వేదికగా జనవరి 27, 28 తేదీల్లో జరిగిన వేలంలో కేఎల్ రాహుల్‌ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ.11 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కేఎల్ రాహుల్ మాట్లాడుతూ 'ఈ ఏడాది కొత్త ఫ్రాంఛైజీకి ఆడుతున్నాను. జీవితంలో ఇలాంటి ఊహించని ప్రయాణాలు చేయడం సాధారణం. బెంగళూరు, హైదరాబాద్ జట్ల నుంచి చాలా నేర్చుకున్నాను' అని అన్నాడు.
'అలాగే సహచర ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ నుంచి మద్దతు దక్కింది. ఏ జట్టు తరఫున ఆడినా మన ఆట తీరు అయితే మారదు. జట్టు విజయాల కోసం మంచి ప్రదర్శన చేయాలి. త్వరలో పంజాబ్ జట్టుతో కలిసి పని చేస్తాను. ఈ కొత్త ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నాను. వీలైనంత వరకు గాయాలకు దూరంగా ఉండి టోర్నీలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని అనుకుంటున్నా' అని తెలిపాడు.
'జాతీయ జట్టులో కొనసాగడం అనేది ఎంతో ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. అయితే ఆ ఒత్తిడి కేవలం స్కిల్స్‌తో కూడుకున్నది మాత్రమే కాదు... మానసికంగా, శారీరకంగా. మనల్ని మనం చైతన్యవంతుల్ని చేసుకోవడంతో పాటు ఫిట్‌గా ఉండటం కూడా ఎంతో ముఖ్యం. ఈ విషయాన్ని టీమిండియాలో నిలకడగా రాణిస్తోన్న ఆటగాళ్ల నుంచి నేర్చుకున్నా' అని రాహుల్ అన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌లో కొత్త సవాళ్లను స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కేఎల్ రాహుల్ చెప్పాడు. ఐపీఎల్ విషయానికి వస్తే పంజాబ్ యాజమాన్యం కేఎల్ రాహుల్‌ని బ్యాట్స్‌మన్‌గా కంటే వికెట్ కీపర్‌గానే జట్టులో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా కనిపిస్తోంది.