వన్డే వరల్డ్ కప్-2023ను భారత్ తృటిలో చేజార్చుకుంది. కానీ ఏడు నెలల తర్వాత పాల్గొన్న మహా సమరంలో విశ్వవిజేతగా నిలిచింది. టీ20 వరల్డ్ కప్-2024లో ఛాంపియన్‌గా నిలిచింది. ఇక ఏడాదిలోపు జరగనున్న మరో రెండు మెగాటోర్నీల్లోనూ టైటిల్‌ను అందుకునేలా టీమిండియా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇది వన్డే ఫార్మాట్ సమరం.
అలాగే 2025 జూన్‌లో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని భారత్ వ్యూహాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనకు స్టార్ క్రికెటర్లను దూరం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్‌తో వరుసగా క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని యోచిస్తోంది.

ఇప్పటికే రోహిత్, కోహ్లి టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అలాగే జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనుంది. దీంతో శ్రీలంక వన్డే సిరీస్‌కు ఈ స్టార్లు దూరం కానున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్య లేదా కేఎల్ రాహుల్‌ను కెప్టెన్సీ బాధ్యతలు అందించే అవకాశం ఉంది. అయితే లంక పర్యటన ముగిసిన తర్వాత స్వదేశంలో టీమిండియా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. హార్దిక్‌ను తిరిగి టెస్టు జట్టులోకి తీసుకురావాలని భావిస్తే హార్దిక్‌కు కూడా విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.
ఈ సందర్భంలో లంక పర్యటనలో కేఎల్ రాహుల్ భారత జట్టును నడిపిస్తాడు. శ్రీలంక పర్యటనకు భారత జట్టును ఎంపిక చేసే సమయానికి కొత్త కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు అందుకోనున్నాడు. ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్‌తో లక్నో సూపర్ జెయింట్స్‌లో గంభీర్ పనిచేశాడు. రాహుల్ నాయకత్వ నైపుణ్యాల గురించి గంభీర్‌కు బాగా తెలుసు. దీంతో రాహులే శ్రీలంక వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికవ్వడం దాదాపు ఖాయమే. కాగా, ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియాకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్. మరికొన్ని రోజుల్లో భారత జట్టుకు మరో కొత్త కెప్టెన్ రానుండటం గమనార్హం.