టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో రాహుల్ సాధించిన అజేయ సెంచరీ (112 నాటౌట్) చూసిన తర్వాత, గవాస్కర్ అతడిని భారత మాజీ కెప్టెన్, 'ది వాల్' రాహుల్ ద్రవిడ్‌తో పోల్చారు. ప్రస్తుత జట్టులో రాహుల్ అత్యంత నమ్మదగ్గ 'ఆపద్బాంధవుడు' అని అభివర్ణించారు.
ద్రవిడ్ తరహాలోనే రాహుల్..
స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గవాస్కర్.. కర్ణాటకకు చెందిన ఇద్దరు రాహుల్‌ల మధ్య ఉన్న సారూప్యతను గుర్తు చేశారు. "కేఎల్ రాహుల్ ఎప్పుడూ ఒక క్లాస్ ప్లేయరే. అతని ఆట చూడముచ్చటగా ఉంటుంది. సాంకేతికత, సహనం, అన్ని రకాల షాట్లు అతని దగ్గర ఉన్నాయి. ఒకప్పుడు కర్ణాటకకే చెందిన మరో రాహుల్ (ద్రవిడ్) జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఆదుకునేవాడో, ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా అలాగే చేస్తున్నాడు. అతను క్రీజులో ఉంటే జట్టు సేఫ్ అనే నమ్మకం కలుగుతుంది" అని సునీల్ గవాస్కర్ అన్నారు.

రాజ్‌కోట్ ఇన్నింగ్స్ వెనుక..
రాజ్‌కోట్ వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తక్కువ స్కోరుకే అవుటైన వేళ భారత్ కష్టాల్లో పడింది. ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్, అద్భుతమైన పోరాట పటిమను కనబరిచాడు. కేవలం 87 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన రాహుల్, మొత్తం 92 బంతుల్లో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారత్ స్కోరు 284కు చేరుకోవడంలో రాహుల్ పాత్ర కీలకం. ఒకవేళ అతను త్వరగా ఔట్ అయి ఉంటే, భారత్ 240 పరుగులు కూడా చేసేది కాదని గవాస్కర్ విశ్లేషించారు.
నంబర్ 5లో తిరుగులేని రికార్డు
గత మూడు వన్డేల్లో రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి వరుసగా 40, 66, 112* పరుగులు సాధించాడు. ఐదో నంబర్‌లో రాహుల్ ఇప్పటివరకు 33 వన్డేల్లో 63 పైగా సగటుతో 1,467 పరుగులు చేశాడు. ఆరో నంబర్‌లో అతని ప్రదర్శన కంటే ఐదో నంబర్‌లోనే రాహుల్ అత్యంత ప్రభావవంతంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. టాపార్డర్ వైఫల్యం తర్వాత జట్టును ఆదుకోవడంలో కేఎల్ రాహుల్ చూపిస్తున్న పరిణతి టీమిండియాకు పెద్ద ప్లస్ పాయింట్. గవాస్కర్ అన్నట్లుగా, కష్టకాలంలో జట్టును గట్టెక్కించే నమ్మదగ్గ ఆటగాడిగా రాహుల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు.