ఢిల్లీ: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో ఆడనున్నాడు. రాహుల్ కర్ణాటక రంజీ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈనెల 29 నుంచి బెంగాల్‌తో జరిగే సెమీఫైనల్లో ఆడనున్నాడు. ఇప్పటికే కర్ణాటక జట్టుతో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండే కలవగా.. తాజాగా రాహుల్ కూడా జట్టులో చేరనున్నాడు. దీంతో కర్ణాటక జట్టు మరింత పటిష్టంగా మారనుంది.
డేట్ ఫిక్స్.. ధోనీ వచ్చేస్తున్నాడు!!
న్యూజిలాండ్ పర్యటనలో పరిమిత ఓవర్ల క్రికెట్లో రాహుల్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. కివీస్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌లో 56 సగటుతో 224 పరుగులు చేసాడు. ఇక మూడు వన్డేల సిరీస్‌లో 204 పరుగులు చేశాడు. గత పది ఇన్నింగ్స్‌ల్లో ఒక సెంచరీతో పాటు నాలుగు అర్ధ శతకాలు బాదాడు. కివీస్ గడ్డపై కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం పరుగులు చేయడంలో తడబడ్డా.. రాహుల్ మాత్రం అద్భుతంగా రాణించాడు.
కివీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ అనంతరం పాండే, రాహుల్ స్వదేశానికి తిరిగొచ్చారు. టెస్ట్ జట్టుకు ఎంపిక కాకపోవడంతో.. వన్డే సిరీస్ ముగిసిన వెంటనే స్వదేశాని వచ్చారు. అయితే జమ్మూతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో రాహుల్‌కు కర్ణాటక యాజమాన్యం విశ్రాంతినిచ్చింది. ఇక క్వార్టర్ ఫైనల్లో పాండేకి అవకాశమివ్వడంతో (37; 35) పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కర్ణాటక 167 పరుగులతో విజయం సాధించింది. మరోవైపు సౌరాష్ట్ర, గుజరాత్ రాజ్‌కోట్ వేదికగా రెండో సెమీస్‌లో తలపడనున్నాయి.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవల విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో కేఎల్ రాహుల్ తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ 823 రేటింగ్ పాయింట్లతో తన స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. ఈ సిరీస్‌లో 105 పరుగులే చేసిన విరాట్ కోహ్లీ 9వ స్థానం నుంచి పదో స్థానానికి పడిపోయాడు. టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి వీరిద్దరే టాప్-10లో చోటుదక్కించున్నారు.