టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసిన భారత్ వన్డే సిరీస్‌లో చెలరేగింది. నిర్ణయాత్మక మూడో వన్డేలో 78 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. సంజు శాంసన్ (108; 114 బంతుల్లో), తిలక్ వర్మ (52; 77 బంతుల్లో), రింకూ సింగ్ (38; 27 బంతుల్లో) రాణించారు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. అర్షదీప్ సింగ్ (4/30), వాషింగ్టన్ సుందర్ (2/38), అవేశ్ ఖాన్ (2/45) సత్తాచాటారు. సఫారీ జట్టు ఓపెనర్ టోనీ డిజోర్జి (81; 87 బంతుల్లో) పోరాడాడు.
అయితే దక్షిణాఫ్రికా ప్లేయర్ కేశవ్ మహరాజ్ క్రీజులోకి వచ్చినప్పుడు స్టేడియంలో ప్రభాస్ సాంగ్ ప్లే చేశారు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలోని 'రామ్.. సీతా రామ్' మెలోడియస్ హిందీ వెర్షన్ సాంగ్ అది. అయితే ఇక్కడే ఓ లాజిక్‌ను కేఎల్ రాహుల్ కనిపెట్టాడు. కేశవ్ మహరాజ్ బ్యాటింగ్ చేస్తున్న టైమ్‌లోనూ, అలాగే అతడు బౌలింగ్ స్టార్ట్ చేసిన సమయంలోనూ ఆ సాంగ్ ప్లే చేశారు. దీని గురించి మహరాజ్‌ను రాహుల్ అడగ్గా.. అవును అంటూ అతడు బదులిచ్చాడు.

వారిద్దరి సంభాషణ అంతా స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా, కేశవ్ మహరాజ్ భారత్ సంతతికి చెందినవాడే. అతడి పూర్వీకులు ఉత్తరప్రదేశ్‌లో నివసించేవారు. 19వ దశాబ్దంలోనే దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. దీంతో ఆ సాంగ్ ప్లే చేసి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
పార్ల్ వేదికగా జరిగిన మూడో వన్డేలో కేశవ్ మహరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. పది ఓవర్లు వేసిన అతడు 37 పరుగులే ఇచ్చి తిలక్ వర్మను ఔట్ చేశాడు. ఛేదనలో 27 బంతులు ఎదుర్కొని 14 పరుగులు చేశాడు.