
బంగ్లాతో కీలకమైన తొలి టెస్టుకు భారత జట్టు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో తొలిసారి టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ ఈ జట్టుకు సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. చట్టోగ్రాం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాహుల్.. గాయాల వల్ల జట్టు కూర్పు మారిందని చెప్పాడు. అయితే ఇది కొత్త వాళ్లకు మంచి అవకాశం అని అభిప్రాయపడ్డాడు.
రోహిత్ స్థానంలో జట్టుకు ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్‌కు అవకాశం దక్కలేదు. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తున్నట్లు కెప్టెన్ వెల్లడించాడు. అలాగే తాము ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగుతున్నట్లు తెలిపాడు. రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ ఆడుతున్నట్లు చెప్పాడు. అతనితోపాటు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌లో తమ స్పెషలిస్టు స్పిన్నర్లు అని వెల్లడించాడు.

గాయం కారణంగా ఈ మ్యాచ్ ఆడతాడా? లేదా? అనుకున్న బంగ్లా సారధి షకీబల్ హసన్.. ఈ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. తమ జట్టులో కొత్తగా జాకిర్ హసన్ అరంగేట్రం చేస్తున్నట్లు వెల్లడించాడు. టాస్ గెలిచి ఉంటే తను కూడా ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే వాడినని, అయితే ముందుగా కొన్ని వికెట్లు తీసుకోవడానికి ప్రయత్నిస్తామని చెప్పాడు. సుమారు ఐదు నెలల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్నామని, అయితే తాము దీని కోసం చక్కగా రెడీ అయ్యామని చెప్పాడు.
భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్
బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హుస్సేన్ షాంటో, జాకిర్ హసన్, యాసిర్ అలీ, షకీబల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, నురుల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లామ్, ఖాలెద్ అహ్మద్, ఎబాదత్ హొస్సేన్