హైదరాబాద్: 18 ఏళ్ల ఓ యువ స్కేటర్‌కు మద్దతు ఇచ్చేందుకు గాను టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తన పేరుని మార్చుకున్నాడు. అయితే రాహుల్ పేరు మార్చుకుంది రికార్డుల పరంగా కాదులెండి. తన ట్విట్టర్ అకౌంట్‌కి ఆ యువ స్కేటర్ పేరు పెట్టాడు. ఇంతకీ ఎవరా యువ స్కేటర్ అనుకుంటున్నారా?
అతడి పేరు నిశ్చయ్ లూత్రా. వయసు 18 ఏళ్లు. 2018 వింటర్ ఒలింపిక్స్‌లో ఎలాగైనా పాల్గొనాలనే ఉద్దేశ్యంతో సొంతంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. నిశ్చయ్ లూత్రాకి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ, ఇటు స్పాన్సర్ల నుంచి ఎటువంటి మద్దతు లభించడం లేదు. దీంతో అతడి గురించి తెలుసుకున్న రాహుల్ నిశ్చయ్‌కు మద్దతుగా ఇలా చేశాడు.

దీంతో కేఎల్ రాహుల్‌కి తోడు మరికొందరు క్రికెటర్లు తమ వంతుగా నిశ్చయ్‌కు మద్దతుగా నిలిచారు. నిశ్చయ్‌కు మద్దతుగా నిలిచిన వారిలో రోహిత్ శర్మ, రిషబ్ పంత్, ఉన్ముక్త్ చంద్‌లు ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే నిశ్చయ్ కోసం అడిడాస్ కంపెనీ ఈ మధ్యే ఓ ప్రచారం మొదలుపెట్టింది.
#FanFire పేరుతో నిశ్చయ్ కోసం విరాళాలు సేకరించాలని అడిడాస్ లక్ష్యంగా పెట్టుకుంది. జులై 19 వరకు రూ. 35 లక్షలు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రూ. 1.5 లక్షల విరాళాలు సేకరించారు. ఇందులో భాగంగా నిశ్చయ్‌పై ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక నిశ్చయ్ లూత్రా విషయానికి వస్తే నేషనల్ ఛాంపియన్ షిప్‌లో 12 పతకాలు గెలిచాడు. ఇందులో 9 బంగారు పతకాలు కాగా, 3 వెండి పతకాలు ఉన్నాయి. అంతర్జాతీయ స్ధాయిలో బంగారు పతకంతో పాటు కాంస్య పతకం కూడా గెలిచాడు.