టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి తమ వెడ్డింగ్ వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇవాళ తమ మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ వీడియోలో మెహందీ వేడుక, సంగీత్ కార్యక్రమంతో పాటు వైభంగా జరిగిన పెళ్లి వీడియో క్లిప్స్ ఉన్నాయి.
గతేడాది జనవరి 23న రాహుల్-అతియా వివాహం జరిగిన విషయం తెలిసిందే. చాలా సింపుల్‌గా అతి కొద్దిమంది ఆత్మీయుల మధ్య పెళ్లి చేసుకున్నారు. అతియా తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఫామ్ హౌస్‌లో ఈ జంట ఏడు అడుగులు వేసింది. రాహుల్, అతియా ప్రేమలో ఉన్నట్లు 2019 నుంచే వార్తలు మొదలయ్యాయి. వారిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. ఆ సమయంలో ఆ వార్తలని వారిద్దరు కొట్టిపారేశారు.

ఆ తర్వాత పబ్లిక్‌గా ఓపెన్ అయ్యారు. భారత్‌లో పాటు విదేశాల్లో చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అంతేగాక రాహుల్‌తో కలిసి అతియా టీమిండియా పర్యటనలకు కూడా వెళ్లింది. ఐపీఎల్ సమయంలోనూ అతనితోనే ఉంది. ఇక రాహుల్ క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. అయితే ఈ సిరీస్‌లో అతడు వికెట్ కీపర్‌గా కాకుండా కేవలం బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగుతున్నాడు.
కాగా, గతేడాది ఐపీఎల్ సీజన్‌లో రాహుల్ గాయపడిన తర్వాత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొన్నాడు. తిరిగి ఫిట్‌నెస్ సాధించడానికి తీవ్రంగా శ్రమించాడు. మరోవైపు పూర్తి ఫిట్‌నెస్ సాధించకముందే ఆసియా, ప్రపంచకప్‌లకు రాహుల్ ఎంపికవ్వడాన్ని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు పెద్దఎత్తున విభేదించారు. రాహుల్‌ను వద్దన్నారు, అతడి స్థానంలో మరో ప్లేయర్‌కు అవకాశం ఇవ్వాలని వాదనలు వినిపించారు. కానీ కొద్ది రోజుల్లోనే వారి అంచనాలు, అభిప్రాయాలు తప్పని రాహుల్ నిరూపించాడు. ఆరు నెలల తర్వాత మైదానంలో అడుగుపెట్టిన కేఎల్ రాహుల్.. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై అజేయ శతకం (111*) సాధించాడు.
ఆ తర్వాత జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో పరుగుల వరద పారించాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో 75 సగటుతో 452 పరుగులు చేశాడు. అంతేగాక పరిస్థితులకు తగ్గట్టుగా జాగ్రత్తగా, దూకుడుగా గేర్‌లు మార్చుతూ జట్టుకు విజయాలు అందించాడు. ఇటీవల బలమైన దక్షిణాఫ్రికా పేసర్లను కఠిక పిచ్‌పై సమర్థంగా ఎదుర్కొంటూ కేఎల్ రాహుల్ (101) వీరోచితక శతకం సాధించాడు.