ప్లేఆఫ్స్ రేసులో చాలా కీలకమైన మ్యాచ్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ రెడీ అవుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో లక్నో జట్టులో ఒక కీలకమైన మార్పు చేయాలని టీమిండియా మాజీ దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. లక్నో చివరగా ఆడిన మ్యాచ్‌లో విధ్వంసకర ఓపెనర్ కైల్ మేయర్స్‌ను పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే.
ఆ నిర్ణయం చాలా తప్పు అని చాలా మంది నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌లో ఇలాంటి పొరపాటు చేయొద్దని, కైల్ మేయర్స్‌ను ఆడించాలని చోప్రా సూచించాడు. మొత్తం నలుగురు విదేశీ బ్యాటర్లతోనే బరిలో దిగితే మంచిదని అభిప్రాయపడ్డాడు. దీని కోసం ఆఫ్ఘన్ పేసర్ నవీన్ ఉల్ హక్‌ను పక్కన పెట్టాలని సలహా ఇచ్చాడు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో లక్నో, కోల్‌కతా మ్యాచ్‌పై చోప్రా విశ్లేషణ ఇచ్చాడు. ఈ క్రమంలోనే లక్నో మొత్తం నలుగురు విదేశీ బ్యాటర్లతోనే బరిలో దిగితే చాలా మంచిదని సూచించాడు. గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన దీపక్ హుడా ఫెయిలైన సంగతి తెలిసిందే. కాబట్టి మంచి ఆరంభాలు అందిస్తున్న కైల్ మేయర్స్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని చోప్రా చెప్పాడు.
'లక్నో నలుగురు విదేశీ బ్యాటర్లతో రంగంలోకి దిగొచ్చు. నవీన్ ఉల్ హక్‌ను పక్కన పెట్టేసి, అతని స్థానంలో కైల్ మేయర్స్‌ను ఆడిస్తే మంచిది. అతను కనుక సునీల్ నరైన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటే చాలు. క్వింటన్ డీకాక్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, మార్కస్ స్టొయినిస్, ఆయుష్ బదోనీ, ప్రేరక్ మన్కడ్, కృనాల్ పాండ్యా.. వీళ్లు ఆ టీం టాప్-7 ప్లేయర్లుగా ఉంటే బెటర్' అని చోప్రా సూచించాడు.
ఈ పిచ్‌పై పూర్తి భారతీయ బౌలింగ్ లైనప్‌తో లక్నో బరిల దిగాలని చోప్రా అన్నాడు. 'యష్ ఠాకూర్, మొహ్‌సిన్ ఖాన్, ఆవేష్ ఖాన్‌ను పేసర్లుగా తీసుకోవాలి. రవి బిష్ణోయి, అమిత్ మిశ్రా, కృనాల్ పాండ్యా ముగ్గురూ స్పిన్ బాధ్యతలు పంచుకుంటే చాలు' అని చెప్పాడు. ప్రస్తుతం ఆ జట్టులో రవి బిష్ణోయి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అదే సమయంలో కోల్‌కతా కూడా స్పిన్‌తోనే లక్నోను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుందన్నాడు.