
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్..14వ ఎడిషన్‌లో భాగంగా- శనివారం రాత్రి ముంబైలోని వాంఖెడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయింది. ఈ సీజన్‌లో కోల్‌కత జట్టుకు ఇది వరుసగా నాలుగో ఓటమి. ఇప్పటిదాకా ఆడిన అయిదు మ్యాచ్‌లల్లో గెలిచిందొక్కటే. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం వరుసగా నాలుగింట్లో పరాజయాన్ని అందుకుంది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ- దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత టీమ్.. నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులే చేయగలిగింది. ఈ మాత్రం పరుగుల కోసం తొమ్మిది వికెట్లను కోల్పోయింది. కేప్టెన్ ఇవాన్ మోర్గాన్ డైమండ్ డక్ సాధించాడు. ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్ చేరాడు. నాన్ స్టైకింగ్ ఎండ్‌లో ఉండి రనౌట్ అయ్యాడు. హార్డ్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ మరోసారి విఫలమయ్యాడు. తీవ్రంగా నిరాశపరిచాడు. తొమ్మిది పరుగులు మాత్రమే చేసి, ఉసూరుమనిపించాడు. ఈ తొమ్మిది పరుగుల్లోనూ ఒక సిక్సర్ ఉంది. అది అతని హార్డ్ హిట్టింగ్‌ను సూచిస్తోంది.
ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్‌లను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు జరపాలనే డిమాండ్ సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తోంది. వారిద్దరూ పవర్ ప్లేలో రాణించగలుగుతారని, వారికి బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలని కోల్‌కత నైట్‌రైడర్స్ అభిమానులు కోరుతున్నారు. సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకోగలిగితే.. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తారని అంటున్నారు. ప్రత్యేకించి- ఆండ్రీ రస్సెల్ బ్యాటింగ్‌కు వచ్చే స్థానాన్ని మార్చి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు కోల్‌కత ఫ్యాన్స్.
ప్రత్యేకించి- ఆండ్రీ రస్సెల్. అతను బ్యాటింగ్‌కు దిగే సమయానికి ఎక్కువ ఓవర్లు ఉండట్లేదని, ఫలితంగా కుదురుకోకుండానే భారీ షాట్లను ఆడి అవుట్ అవుతున్నాడంటూ విశ్లేషిస్తున్నారు. ఇవాన్ మోర్గాన్, దినేష్ కార్తీక్ కంటే ముందుగా ఆండ్రీ రస్సెల్‌ను బ్యాటింగ్‌కు పంపించాలని టీమిండియా మాజీ ఓపెనర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ వంటి మాజీ క్రికెటర్లు సైతం కోల్‌కత్ మేనేజ్‌మెంట్‌కు సలహాలను ఇస్తున్నారు. ఓపెనర్ నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, మిడిలార్డర్‌లో దినేష్ కార్తీక్ మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ సాధిస్తున్నప్పటికీ.. టాప్ ఆర్డర్‌లో రస్సెల్‌ను తీసుకుని రావాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.