సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. చెపాక్ వేదికగా జరిగిన క్వాలిఫయిర్-2లో రాజస్థాన్ రాయల్స్‌పై 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆరేళ్ల తర్వాత తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరు కోసం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.
మందకొడి పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 175 పరుగులు సాధించింది. హెన్రిచ్ క్లాసెన్ (50; 34 బంతుల్లో, 4x6) అర్ధశతకంతో సత్తాచాటాడు. రాహుల్ త్రిపాఠి (37; 12 బంతుల్లో, 5x4, 2x6), ట్రావిస్ హెడ్ (34; 28 బంతుల్లో, 3x4, 1x6) ఫర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ (3/27), ట్రెంట్ బౌల్ట్ (3/45) చెరో మూడు, సందీప్ శర్మ (2/25) రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. ధ్రువ్ జురెల్ (56*; 35 బంతుల్లో, 7x4, 2x6), యశస్వీ జైస్వాల్ (42; 21 బంతుల్లో, 4x4, 3x6) పోరాడారు. షాబాజ్ అహ్మద్ (3/23) మూడు, అభిషేక్ శర్మ (3/24) రెండు వికెట్లతో రాజస్థాన్‌ను చిత్తుచేశారు. నటరాజన్ (1/13), కమిన్స్ (1/30) చెరో వికెట్ తీశారు.
రేపటి ఫైనల్‌లో కేకేఆర్‌పై విజయం సాధిస్తే తెలుగు టీమ్ ఖాతాలో మూడో టైటిల్ చేరుతుంది. 2009లో గిల్ క్రిస్ట్ నేతృత్వంలో డెక్కన్ ఛార్జర్స్ తొలిసారి ట్రోఫీని గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్‌రైజర్స్ టీమ్ రెండో కప్ సాధించింది. అయితే 2009లో విజేతగా నిలిచిన డెక్కన్ ఛార్జర్స్ 2008 సీజన్‌లో పేలవప్రదర్శన చేసింది. తొలి సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగన నిలిచింది. దీంతో రెండో సీజన్‌లో ఛార్జర్స్ గెలుస్తుందనే ఎవరూ ఊహించలేదు.
కానీ అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుతంగా డెక్కన్ ఛార్జర్స్ ట్రోఫీని సాధించింది. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది. గత సీజన్‌లో పదో స్థానంలో నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్ ఈ సారి ఫైనల్‌కు చేరింది. టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. 2009 సెంటిమెంట్‌తోనే 2024లోనూ సన్‌రైజర్స్ విజేతగా నిలుస్తుందని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది.