
పంజాబ్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆ జట్టు బ్యాటర్ ఆండ్రూ రసెల్ విధ్వంసంతో మరో 5 ఓవర్లు మిగిలి ఉండగానే కోల్‌కతా లక్ష్యాన్ని అందుకుంది. రసెల్ 31 బంతుల్లోనే 70 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. అంతకుముందు బౌలింగ్‌లో ఉమేష్ యాదవ్ 4 వికెట్లతో చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ జట్టు 137 పరుగులకే ఆలౌటైంది.
అయితే మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ కార్యక్రమంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తమ జట్టు ఓటమిపై మాట్లాడాడు. తమ జట్టు బ్యాటింగ్ సరిగ్గా చేయలేదని అంగీకరించాడు. ఇది 170 పరుగుల వికెట్‌గా చెప్పుకోచ్చాడు. తాము ఇన్నింగ్స్‌ను బాగానే ప్రారంభించామని, కానీ లాభం పొందలేకపోయామని చెప్పాడు. కొన్ని అనవసరమైన తప్పిదాలతో వికెట్లు చేజార్జుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే తమ బౌలర్లు కొత్త బంతితో నిజమైన పోరాటాన్ని ప్రదర్శించారని, 50 పరుగులకే 4 వికెట్లు తీసి టీంను మ్యాచ్‌లోకి తెచ్చారని మయాంక్ అగర్వాల్ అన్నాడు. కానీ ఆండ్రూ రసెల్ తమ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడని చెప్పాడు. తమ జట్టు నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్న ఘనత రసూల్‌దేనని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ పేర్కొన్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ జట్టు ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. పవర్ ప్లేలోనే టాప్ 3 వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసే సమయానికి సగం వికెట్లు కోల్పోయింది. దీంతో ఆ జట్టు 100 పరుగులు కూడా చేయడం కష్టంగానే కనిపించింది. అయితే చివర్లో టేలేండర్ రబాడ మెరుపులు మెరిపించడంతో 137 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ బ్యాటర్లలో రాజపక్స 31, రబాడ 25, లివింగ్ స్లోన్ 19, ధావన్ 16 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4, సౌథీ 2 వికెట్లు తీశాడు. అనంతరం 138 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా మరో 5 ఓవర్లు మిగిలి ఉండగానే చేధించింది. ఆ జట్టు బ్యాటర్ రసెల్ 31 బంతుల్లోనే 70 పరుగులతో అజేయంగా నిలిచాడు.