KKR VS PBKS: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. 16 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. హర్షిత్ రాణా (3/25), వరుణ్ చక్రవర్తి (2/21), నరైన్ (2/14) దెబ్బకు.. మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (15 బంతుల్లో 30; 2×4, 3×6) కాస్త రాణించాడు. లక్ష్య ఛేదనలో చాహల్‌తో (4/28) పాటు యాన్సెన్ (3/17) చెలరేగడంతో .. కోల్‌కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. రఘువంశీ ( 28 బంతుల్లో 37; 5×4, 1×6) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు.
అప్పుడు అవకాశం తీసుకోవాలనుకోలేదు..
అయితే ఈ స్వల్ప స్కోర్ల మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ ఔట్ అవ్వడంపై కెప్టెన్ అజింక్యా రహానే నిరాశను వ్యక్తం చేశారు. పంజాబ్ కింగ్స్ 111 పరుగుల స్కోరును డిఫెండ్ చేసి, కేకేఆర్‌ను 95 పరుగులకే ఆలౌట్ చేయడంపై రహానే మాట్లాడుతూ.. జట్టు బ్యాటింగ్ వైఫల్యానికి తానే బాధ్యత వహిస్తానని అన్నాడు. "చెప్పడానికి ఏమీ లేదు. జరిగినదంతా అందరం చూశాం. ప్రయత్నించినప్పటికీ ఓటమిచెందడనం ఎంతో నిరాశగా ఉంది. ఈ ఓటమికి నేనే బాధ్యత తీసుకుంటాను. తప్పు షాట్ ఆడాను. అయినప్పటికీ బంతి స్టంప్స్‌ను తాకలేదు. ఎల్బీడబ్ల్యూ తర్వాత అంగ్‌క్రిష్‌తో మాట్లాడినప్పుడు, అంపైర్ కాల్ అయ్యే అవకాశం ఉందని చెప్పాడు. కానీ నేను ఆ సమయంలో అవకాశం తీసుకునేందుకు సిద్ధంగా లేను."

పూర్తి బాధ్యత మాదే..
"మేము బ్యాటింగ్ చెత్తగా చేశాం. పూర్తి బాధ్యత మేం వహిస్తాం. బౌలర్లు నిజంగా అద్భుతం చేశారు. పంజాబ్ బ్యాటింగ్ లైనప్ ను 111 కే కట్టడి చేశారు. ఈ వికెట్‌పై స్వీప్ షాట్ ఆడడం కష్టంగా ఉంది. ఫుల్ ఫేస్‌తో బ్యాటింగ్ చేయడం బెటర్. ఇంటెంట్ కొనసాగాలి.. కానీ క్రికెట్ షాట్స్ ఆడాలి. అయినా ఆ సమయంలో నా మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇది మాకు సులభమైన ఛేధన అనుకున్నాం. డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన తర్వాత, నన్ను నేను కామ్ గా ఉంచుకుని,జట్టుతో ఏం మాట్లాడాలనేది ఆలోచించాలి. ఇంకా టోర్నమెంట్ లో చాలా మ్యాచులు మిగిలి ఉన్నాయి. తప్పుల్ని సరి చేసుకుని, ముందుకు సాగాలి," అని పేర్కొన్నాడు.