ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 18 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో ఐపీఎల్-2024లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా కేకేఆర్ నిలిచింది. అయితే వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా ఏడు వికెట్లకు 157 పరుగులు చేసింది.
వెంకటేశ్ అయ్యర్ (42; 21 బంతుల్లో, 6x4,2x6) టాప్ స్కోరర్. బుమ్రా (2/39), పీయూష్ చావ్లా (2/28) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 16 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. ఇషాన్ కిషన్ (40; 22 బంతుల్లో, 5x4, 2x6), తిలక్ వర్మ (32; 17 బంతుల్లో, 5x4, 1x6) పోరాడారు. వరుణ్ చక్రవర్తి (2/17), రసెల్ (2/34), హర్షిత్ రాణా (2/34) తలో రెండు వికెట్లు తీశారు. సునీల్ నరైన్ (1/21) ఒక్క వికెట్ తీశారు.

అయితే ఇషాన్ కిషన్ వికెట్ తీసి ముంబై వికెట్ల పతనానికి నాంది పలికిన సునీల్ నరైన్ ఈ సీజన్‌లో తన ఖాతాలో 15వ వికెట్ వేసుకున్నాడు. ఈ క్రమంలో నరైన్ అరుదైన ఘనత సాధించాడు. ఓ ఐపీఎల్ సీజన్‌లో 400+ పరుగులతో పాటు 15 వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. నరైన్ కంటే ముందు ఈ ఘనతను షేన్ వాట్సన్, జాక్వెస్ కలిస్ అందుకున్నారు.
2008 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వాట్సన్ 472 పరుగులు, 17 వికెట్లు సాధించాడు. 2012లో కేకేఆర్ తరఫున కలిస్ 409 పరుగులతో పాటు 15 వికెట్లు తీశాడు. కాగా, ఈ సీజన్‌లో బౌలర్‌గానే కాకుండా ఓపెనర్‌గా సత్తాచాటుతున్న నరైన్ 12 మ్యాచ్‌ల్లో 38 సగటుతో 461 పరుగులు చేశాడు. అలాగే 15 వికెట్లు సాధించి కోల్‌కతా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
అంతేగాక నరైన్ ఈ మ్యాచ్‌లో మరో ఘనత సాధించాడు. మెన్స్ టీ20 క్రికెట్‌లో 550 వికెట్ల మైలురాయిని అందుకున్న మూడో బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో డ్వేన్ బ్రావో (625 వికెట్లు), రషీద్ ఖాన్ (574), నరైన్ (550) ఉన్నారు.