
అబుదాబి: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ అదరగొట్టారు. ముంబై ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ (80: 54 బంతుల్లో 3ఫోర్లు, 6సిక్సర్లు) బాదగా .. సూర్యకుమార్ యాదవ్ (47: 28 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్) బౌండరీల మోత మోగించాడు. ఈ ఇద్దరి జోరుతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 రన్స్ చేసి.. కోల్‌కతా ముందు 196 పరుగుల భారీ లక్ష్యంను ఉంచింది. ఇన్నింగ్స్ ఆద్యంతం రోహిత్ తన మార్క్ షాట్లతో అలరించాడు. ఇక కోల్‌కతా బౌలర్ శివమ్ మావి రెండు వికెట్లు పడగొట్టాడు. మావి తన అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ వికెట్‌ను ముంబై కోల్పోయింది. యువ పేసర్ శివమ్ మావి వేసిన తన తొలి ఓవర్‌లోనే డికాక్‌ను పెవిలియన్ చేర్చాడు. రెండో ఓవర్ రెండో బంతిని భారీ షాట్ ఆడేందుకు డికాక్ యత్నించగా.. బంతి టాప్ ఎడ్జ్ తీసుకొని మిడ్‌వికెట్‌లో గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న నిఖిల్ నాయక్ క్యాచ్ అందుకున్నాడు. ఐపీఎల్‌లో శివమ్ మావికి ఇదే తొలి వికెట్.
డికాక్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ ఇద్దరూ ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించారు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డారు. మూడో ఓవర్ వేసిన వారియర్ బౌలింగ్‌లో సూర్యకుమార్ ఏకంగా నాలుగు ఫోర్లు బాది 16 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత ప్రతీ ఓవర్‌లో 10 పరుగులు తగ్గకుండా రన్స్ చేశారు. ఈ జోడీ ధాటికి స్టార్ పేసర్ పాట్ కమిన్స్ సైతం భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఇద్దరూ పవర్‌ప్లే ముగిసేసరికి 59 పరుగులు రాబట్టారు. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని విడదీసేందుకు కోల్‌కతా బౌలర్లు శ్రమించారు.
అయితే ధాటిగా ఆడే క్రమంలో సూర్యకుమార్ హాఫ్ సెంచరీ ముందర ఔట్ అయ్యాడు. సునీల్ నరైన్ వేసిన పదకొండో ఓవర్ అయిదో బంతికి రోహిత్ సింగిల్ తీయగా.. మరో పరుగు కోసం ప్రయత్నిస్తూ యాదవ్ రనౌట్ అయ్యాడు. రోహిత్, యాదవ్ జోడీ 90కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆపై రోహిత్ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం సౌరవ్ తివారి అలరించాడు. 13 బంతుల్లో 21 పరుగులు చేశాడు. భారీ షాట్ ఆడే క్రమంలో క్యాచ్ ఔట్ అయ్యాడు. అయితే రోహిత్ మాత్రం తన దూకుడు ఆపాలడు. అతనికి హార్దిక్ పాండ్యా తోడవ్వడంతో ముంబై స్కోర్ పరుగులు పెట్టింది.
ధాటిగా ఆడే క్రమంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ క్యాచ్ ఔట్ అవ్వగా.. హార్దిక్ పాండ్యా అనూహ్యంగా హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఎవరూ ఊహించని విధంగా బ్యాట్‌ను వికెట్లను కొట్టాడు. ఆపై వచ్చిన కీరన్ పోలార్డ్ మెరుపులు మెరిపించలేకపోయాడు. 7 బంతులాడి ఒక బౌండరీనే కొట్టాడు. దీంతో ముంబై 195 పరుగులకు పరిమితమైంది. ఒకానొక దశలో ముంబై జోరు చూస్తే స్కోరు అలవోకగా 200 దాటేలా కనిపించినా.. కోల్‌కతా బౌలర్లు పుంజుకున్నారు. డెత్ ఓవర్లలో కోల్‌కతా గొప్పగా బౌలింగ్ చేసింది. చివరి నాలుగు ఓవర్లలో 47 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. కోల్‌కతా బౌలర్లలో శివమ్ మావి రెండు వికెట్లు తీశాడు.