ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు లక్నో సూపర్ జెయింట్స్ 162 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. నికోలస్ పూరన్ (45; 32 బంతుల్లో, 2x4, 4x6), కేఎల్ రాహుల్ (39; 27 బంతుల్లో, 3x4, 2x6) సత్తాచాటారు. మిగిలిన బ్యాటర్లు రాణించకపోవడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 161 పరగులు చేసింది. మిచెల్ స్టార్క్ (3/28) మూడు వికెట్లతో మెరిశాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్‌ను రెండు వరుస బౌండరీలతో ఆరంభించిన డికాక్ (10; 8 బంతుల్లో, 2x4)ను రెండో ఓవర్‌లో ఔటయ్యాడు. వైభవ్ అరోరా బౌలింగ్‌లో నరైన్ చేతికి చిక్కాడు. విఫలమవుతున్న దేవదత్ పడిక్కల్ స్థానంలో జట్టులోకి వచ్చిన దీపక్ హుడా (8, 10 బంతుల్లో, 1x4) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. స్టార్క్ బౌలింగ్‌లో రమణ్‌దీప్ స్టన్నింగ్ క్యాచ్ ఫలితంగా వెనుదిరిగాడు.

వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ (39; 27 బంతుల్లో, 3x4, 2x6) దూకుడుగా ఆడటంతో లక్నో పవర్‌ప్లేలో 49 పరుగులు చేసింది. ఆయుష్ బదోనితో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. మూడో వికెట్‌కు 39 పరుగులు జోడించాడు. కానీ వీరిద్దరు నిలకడగా బ్యాటింగ్ చేయడంతో లక్నో రన్‌రేట్ క్రమంగా తగ్గింది.
అయితే కుదురుకున్న రాహుల్‌ను రసెల్ బోల్తాకొట్టించాడు. 11వ ఓవర్‌లో సిక్సర్‌తో రసెల్‌ను ఆహ్వానించిన రాహుల్ తర్వాతి బంతికే ఔటయ్యాడు. ఆ తర్వాత స్టొయినిస్ (10; 5 బంతుల్లో), ఆయుష్ పెవిలియన్‌కు చేరారు. స్టొయినిస్‌ను చక్రవర్తి, ఆయుష్‌ను నరైన్ ఔట్ చేశారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్య (7; 8 బంతుల్లో)తో కలిసి పూరన్ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు.
కానీ కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఓ దశలో లక్నో 17 ఓవర్లకు 126 పరుగులే చేసింది. కానీ 18వ ఓవర్‌లో పూరన్ చెలరేగాడు. వైభవ్ అరోరా ఓవర్‌లో పూరన్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 18వ ఓవర్‌లో 18 పరుగులు వచ్చాయి.
అదే జోరును లక్నో బ్యాటర్లు కొనసాగించలేకపోయారు. పిచ్ బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించకపోవడంతో 161 పరుగులకే పరిమితమయ్యారు. ఆఖరి ఓవర్ వేసిన స్టార్క్ ఆరు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. కోల్‌కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు, వైభవ్, నరైన్, వరుణ్ చక్రవర్తి, రసెల్ తలో వికెట్ తీశారు.