KKR VS GT: ఐపీఎల్ 2025లో తాజాగా జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచులో నిర్ణీత 20 ఓవర్లలో 198 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (55 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 90 పరుగులు) సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. 10 పరుగుల దూరంలో శతకానికి ఆగిపోయాడు. సాయి సుదర్శన్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 52 పరుగులు) మరోసారి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
మొదట స్లోగా షురూ చేసిన శుభ్‌మన్ గిల్-సాయి సుదర్శన్ జోడీ.. ఆ తర్వాత దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే పవర్ ప్లేలో గుజరాత్ జట్టు 45/0 స్కోరు చేసింది. అయితే దూకుడుగా ఆడుతోన్న సుదర్శన్ ను రస్సెల్ విడదీశాడు. రస్సెల్ వేసిన 12.2 ఓవర్ కు వికెట్ కీపర్ గుర్బాజ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో సుదర్శన్, గిల్ తొలి వికెట్ కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సుదర్శన్ 33 బంతుల్లో, గిల్ 34 బంతుల్లో అర్ధ శతకాలను పూర్తి చేశారు. వీరిద్దరూ ఒకే ఓవర్‌లో హాఫ్ సెంచరీలు అందుకోవడం విశేషం.
జోస్ బట్లర్ (23 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 41* పరుగులు) దూకుడు ప్రదర్శించాడు. షారుక్‌ఖాన్(11*) పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో బట్లర్ రెండు ఫోర్లు, షారుక్ ఖాన్ ఓ సిక్సర్ కొట్టడం వల్ల గుజరాత్ స్కోరు 200కు చేరువైంది. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, రస్సెల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
