KKR VS GT: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 39 పరుగుల తేడాతో గెలుపొందింది.
199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ అజింక్యా రహానే (36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 50) హాఫ్ సెంచరీ చేశాడు. యాండ్రూ రసెల్ 15 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 21 కాసేపు దూకుడుగా ఆడి ఔట్ అయ్యాడు. ఇతడు ఔట్ అవ్వడం జీటీకి మరింత కలిసి వచ్చింది. చివర్లో రింకూ సింగ్ (14 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ 17 పరుగులు), రఘువంశీ (13 బంతుల్లో 27 నాటౌట్ ) పరుగులు చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు తీయగా, సిరాజ్, ఇషాంత్ శర్మ, వాష్టింగ్టన్ సుందర్, సాయి కిశోర్ తలో వికెట్ తీశారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (55 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ చేసే అవకాశాన్ని కాస్తలో చేజార్చుకున్నాడు. సాయి సుదర్శన్ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి హాఫ్ సెంచరీతో మెరిశాడు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సుదర్శన్ 33 బంతుల్లో, గిల్ 34 బంతుల్లో అర్ధ శతకాలు చేశారు. వీరిద్దరూ ఒకే ఓవర్‌లో హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. జోస్ బట్లర్ (23 బంతుల్లో 41*; 8 ఫోర్లు) దూకుడు ప్రదర్శన చేశాడు. రాహుల్ తెవాతియా (0) డకౌట్ గా వెనుదిరిగాడు. ఆఖర్లో షారుక్ ఖాన్(11*) పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, రస్సెల్ తలో వికెట్ తీశారు.