
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కోసం వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ జేసన్ హోల్డర్ యూఏఈలో అడుగుపెట్టాడు. కరోనా వైరస్ నేపథ్యంలో హోల్డర్ ఆరు రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం అతడు సన్‌రైజర్స్ హోటల్ రూమ్‌లోనే ఉన్నాడు. ఆరు రోజుల్లో మూడు సార్లు నిర్వహించే వైరస్ పరీక్షల్లో మూడు సార్లు నెగెటివ్‌గా వస్తేనే.. హోల్డర్ సన్‌రైజర్స్ జట్టుతో కలవనున్నాడు.
ఐపీఎల్ 2020 యూఏఈకి వచ్చే క్రికెటర్లు, సహాయక సిబ్బంది, ప్రాంచైజీ యాజమాన్యం ఎవరైనా దుబాయ్ రూల్స్ ప్రకారం కనీసం ఆరు రోజుల పాటు క్వారంటైన్ వ్యవధిని పూర్తి చేయాలి. ఆరు రోజుల్లో మూడు సార్లు నిర్వహించే.. కరోనా టెస్టుల్లో ఫలితం నెగెటివ్‌గా తేలితేనే బయో బబుల్‌లోకి ప్రవేశించవచ్చు. బెంగళూరుతో మ్యాచ్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ స్థానంలో జేసన్ హోల్డర్‌ను సన్‌రైజర్స్ తీసుకున్న విషయం తెలిసిందే.
ఐపీఎల్ 13వ సీజన్‌లో శనివారం రాత్రి మరో ఆసక్తికర పోరు జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు అబుదాబి వేదికగా తలపడనున్నాయి. రెండు జట్లూ కూడా టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమిని ఎదుర్కొన్నాయి. బెంగళూరు చేతిలో ఓడిన సన్‌రైజర్స్ .. శనివారం కోల్‌కతాపై నెగ్గి లీగ్‌లో బోణీ చేయాలని భావిస్తున్నది. తొలి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తు రనౌటైన కెప్టెన్ డేవిడ్ వార్నర్ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. ఇక మిడిలార్డర్‌లో మనీశ్ పాండే, విజయ్ శంకర్, ప్రియం గార్గ్ బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంది.
ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 17 సార్లు తలపడగా 10-7తో కోల్‌కతా లీడ్‌లో ఉంది. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని కేకేఆర్ భావిస్తుండగా.. గెలుపుతో లెక్క సరిచేయాలని ఆరెంజ్ ఆర్మీ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. మరీ గెలుపు ఏ జట్టును వరిస్తుందో..? చూడాలి.
అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. పిచ్ స్పిన్‌కు అనుకూలం. మంచు ప్రభావం ఉంటుంది. ఈ కారణంగానే గత 7 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన కెప్టెన్లు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఓపికగా క్రీజులో కుదురుకుంటే భారీ స్కోర్స్ చేయవచ్చు. గత రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అలానే సక్సెస్ అయ్యారు. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్, డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.