IPL 2026 Auction: ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం తేదీ ఖరారైంది. వచ్చే నెల డిసెంబర్ 16న అబుదాబిలోని ఎతిహాద్ ఎరీనాలో ఈ వేలం జరగనుంది. ఇప్పటికే అన్ని 10 ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టకోవాలనుకున్న ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15(శనివారం) నాటికి సమర్పించాయి. మొత్తం 173 మంది ప్లేయర్లను(49 విదేశీ ప్లేయర్లతో సహా) జట్లు రిటైన్ చేసుకున్నాయి.
ఫ్రాంచైజీల వద్ద మిగిలిన స్లాట్లు, పర్స్
ఈ రిటెన్షన్ ప్రక్రియ తర్వాత మొత్తం 10 జట్లలో 77 స్లాట్‌లు (31 విదేశీ స్లాట్లతో సహా) ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి అన్ని జట్లకు కలిపి ఉన్న మొత్తం పర్స్ విలువ రూ.237.55 కోట్లు. ఫ్రాంచైజీల వారీగా చూస్తే కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) వద్ద అత్యధికంగా రూ.64.3 కోట్లు పర్స్ బ్యాలెన్స్ ఉంది. కేకేఆర్ గరిష్టంగా 13 మంది ఆటగాళ్లను(6 విదేశీయులు) కొనుగోలు చేయవచ్చు. దీని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) రూ.43.4 కోట్లతో రెండో స్థానంలో ఉంది. వారు 9 మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు. ముంబై ఇండియన్స్ వద్ద కేవలం రూ.2.75 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.

జట్టు రిటెన్షన్ వివరాలు
ప్రతి జట్టు గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను కలిగి ఉండవచ్చు. పంజాబ్ కింగ్స్ అత్యధికంగా 21 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ 20 మంది చొప్పున రిటైన్ చేసుకున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యల్పంగా కేవలం 12 మంది ఆటగాళ్లనే రిటైన్ చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 మంది ఆటగాళ్లను నిలుపుకుంది. వారికి 10 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. విదేశీ ఆటగాళ్ల స్లాట్ల విషయానికి వస్తే కేకేఆర్ తర్వాత 5 స్లాట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎక్కువ మంది విదేశీయుల అవసరం ఉంది.. కాగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌లకు కేవలం ఒక విదేశీ స్లాట్ మాత్రమే ఖాళీగా ఉంది.
మొత్తంగా ఈ మినీ వేలం గతంలో కంటే భిన్నంగా ఉండనుంది. అధిక డబ్బు ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ తక్కువ స్లాట్లు ఉన్న పంజాబ్ కింగ్స్, అతి తక్కువ డబ్బు ఉన్న ముంబై ఇండియన్స్ వంటి జట్లు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తాయో చూడాలి.