జిమ్‌లో రెజ్లింగ్ ఆడేసిన కేకేఆర్ ప్లేయర్స్.. నవ్వులు పూయిస్తున్న వీడియో!
ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ జట్టు ప్రయాణం ఒడిదుడుకులతో సాగుతోంది. ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకునేందుకు ఆ జట్టు పోరాడుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. అత్యంత ఒత్తిడితో కూడిన ఈ డూ ఆర్ డై మ్యాచ్‌కు ముందు జట్టులోని వాతావరణాన్ని తేలికపరచడానికి, ఆటగాళ్లను ఒత్తిడి నుంచి దూరం చేయడానికి కేకేఆర్ ప్లేయర్స్ జిమ్‌లో తెగ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను ఫ్రాంచైజీ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
జిమ్ ను డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్‌గా మార్చేసిన రింకూ సింగ్!
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు కేకేఆర్ ఆటగాళ్లు జిమ్‌లో వర్కవుట్ చేస్తూనే సరదాగా గడిపారు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్, విదేశీ ప్లేయర్ టిమ్ సీఫెర్ట్ ఇద్దరూ కలిసి జిమ్‌ను కాస్తా డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్‌గా మార్చేశారు. ప్రముఖ రెజ్లర్ బ్రాక్ లెస్నర్ తరహాలో ఒకరినొకరు పట్టుకుని గాల్లోకి లేపుతూ అల్లాడించారు. వీడియో చివరలో ఇద్దరూ అక్కడే ఉన్న బెంచ్‌పై పడిపోగా.. వెంటనే స్పందించిన కేకేఆర్ సపోర్ట్ స్టాఫ్ ఒకరు జోక్యం చేసుకుని ఇద్దరినీ నవ్వుకుంటూ విడదీశారు. ఈ క్రేజీ రెజ్లింగ్ ఫైట్‌ను నెటిజన్లు, కేకేఆర్ అభిమానులు విపరీతంగా ఇష్టపడుతున్నారు.

కేకేఆర్ ప్లేఆఫ్స్ చేరాలంటే ఏం జరగాలి?
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో కేకేఆర్ అడుగుపెట్టడం అనేది ఇప్పుడు పూర్తిగా అగమ్యగోచరంగా మారింది. ప్లేఆఫ్స్ చేరాలంటే ఇతర జట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. మొదటగా కేకేఆర్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై ఖచ్చితంగా విజయం సాధించాలి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే కేకేఆర్ ఖాతాలో 15 పాయింట్లు చేరుతాయి. అయితే ఇప్పటికే 15 పాయింట్లతో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు రన్ రేట్ కేకేఆర్ కంటే మెరుగ్గా ఉంది. కాబట్టి ఢిల్లీపై కేకేఆర్ కేవలం గెలవడమే కాదు.. భారీ మార్జిన్‌తో విజయం సాధించి రన్ రేట్‌ను పంజాబ్ కంటే మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది.
ముంబై ఇండియన్స్ గెలుపు కోసం కేకేఆర్ ప్రార్థనలు!
కేకేఆర్ ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు కావాలంటే కేవలం వారు గెలవడమే కాకుండా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ చివరి మ్యాచ్‌లో ఓడిపోవాలని కేకేఆర్ కోరుకుంటోంది. రాజస్థాన్ రాయల్స్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిస్తే, ఆ జట్టు 16 పాయింట్లతో నేరుగా నాలుగో స్థానంలో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అప్పుడు కేకేఆర్, పంజాబ్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి. ఒకవేళ ముంబై ఇండియన్స్ చేతిలో రాజస్థాన్ ఓడిపోతే.. అప్పుడు పాయింట్ల పట్టికలో రన్ రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్ నాలుగో స్థానం ఎవరిదనేది తేలుతుంది. అందువల్ల కేకేఆర్ ఆశలు సజీవంగా ఉండాలంటే ముంబై గెలవడం అత్యంత కీలకం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications