
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌ను పూర్తిస్థాయిలో నిర్వహించాలని, అన్ని ఫ్రాంఛైజీలు ఇదే కోరుకుంటున్నాయని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) సీఈవో వెంకీ మైసూర్ పేర్కొన్నారు. ఐపీఎల్ నిర్వహణలో ఎలాంటి దిద్దుబాట్లు ఉండొద్దన్నారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకావాల్సి ఉంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. అయితే అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ని ఐసీసీ వాయిదా వేయాలని చూస్తుంది. ఆ సమయంలో ఐపీఎల్‌ను నిర్వహించే అవకాశాలున్నాయి.
తాజాగా కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'ఐపీఎల్ నిర్వహణలో నాణ్యతపై ఎలాంటి రాజీపడొద్దు. ఆటలో ఉన్న నాణ్యత వల్లే ఈ మెగా టోర్నీకి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. ఐపీఎల్ 2020ని పూర్తిస్థాయిలో నిర్వహించాలని అన్ని ఫ్రాంఛైజీలు కోరుకుంటున్నాయి. షెడ్యూల్ ప్రకారమే పూర్తిస్థాయిలో మ్యాచ్‌లు నిర్వహించాలి. అందరు ఆటగాళ్లూ (విదేశీ ఆటగాళ్లు) ఉండాలి' అని మైసూర్ అన్నారు.
లాక్‌డౌన్ కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ప్రస్తుతమున్న ఆంక్షల నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లు లేకుండానే పరిమిత సంఖ్యలో మ్యాచ్‌లు నిర్వహించాలని మార్చిలో బీసీసీఐ సమావేశంలో పలువురు ఫ్రాంఛైజీలు సూచించారు. ఈ విషయంపై వెంకీ స్పందిస్తూ వాటిని ఖండించారు. ఒకరిద్దరు ఫ్రాంఛైజీలు మినహా మిగతావారంతా విదేశీ ఆటగాళ్లు కచ్చితంగా ఉండాలని స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. వ్యతిరేకంగా సూచనలు చేసిన వారితో తాను తర్వాత మాట్లాడితే.. పొరపాటుగా పేర్కొన్నామని తనతో చెప్పారని మైసూర్ వెల్లడించారు.
ఐపీఎల్ 2020 నిర్వహణకు ఎప్పుడు సమయం కుదిరినా పూర్తిస్థాయిలో నిర్వహిస్తారని వెంకీ మైసూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌కు భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉందన్నారు. ఈ టోర్నీ విజయవంతమవ్వడానికి స్వదేశీ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా తమవంతు కృషిచేశారన్నారు. ఏ జట్టుకైనా స్వదేశీ ఆటగాళ్లే వెన్నుముకలా నిలిచారని పేరొన్నారు. సునీల్ నరైన్, ఆండ్రూ రసెల్, ఇయాన్ మోర్గాన్, ప్యాట్ కమిన్స్ లాంటి విదేశీ ఆటగాళ్లు కేకేఆర్ జట్టుకు వన్నె తెచ్చారని వెంకీ చెప్పకొచ్చారు.