
హైదరాబాద్: భారత జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ భావి క్రికెటర్లకు ఓ సదవకాశాన్ని కల్పించనున్నాడు. మీలో టాలెంట్ దాగి ఉంటే అప్లై చేయండి. మాజీ కోచ్ గ్యారీ యువ క్రికెట్లర్లలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఓ వినూత్న కార్యక్రమం రూపొందించాడు. ఈ నెల 23 నుంచి వచ్చే మే నెల 18వరకు టాలెంట్ స్కౌట్ కార్యక్రమం ప్రారంభించాడు. 25 రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్ లో భారత్‌లోని 8 నగరాల నుంచి మంచి నైపుణ్యం ఉన్న ఆరుగురు క్రికెటర్లను ఎంపిక చేయనున్నాడు.
టాప్‌లో నిలిచిన ఆరుగురు యువ క్రీడాకారులకు పూణెలో వీకెండ్ ట్రైనింగ్ ఇవ్వనున్నాడు. అలాగే టాప్‌లో నిలిచిన ముగ్గురు క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ. 2లక్షల స్కాలర్‌షిప్‌తో పాటు రెండు నెలల పాటు గ్యారీ కిర్‌స్టెన్ క్రికెట్‌లో ఉండేందుకు సౌకర్యం కల్పించనున్నారు. టాలెంట్ స్కౌట్ ఎంట్రీ ఫీజు రూ.1000. దీనిలో పాల్గొనేందుకు కేవలం టాలెంట్ మాత్రమే అర్హత.
అండర్ 19, అండర్ 14, ఓపెన్ అంటూ మూడు కేటగిరీలుగా ఎంపికచేయనున్న టాలెంట్ హంట్‌లో పాల్గొనేందుకు క్రీడాకారులు వారి పేరు, నగరం, కాంటాక్ట్ వివరాలు 9112295566 ఫోన్ నెంబర్‌కు వాట్సప్ చేయడమే.
ఇప్పటికే ఇటువంటి సెలక్షన్ల ద్వారా ఎంతో మంది క్రికెటర్లు వెలుగులోకి వచ్చి ఐపీఎల్‌లో, అంతర్జాతీయ క్రికెట్‌లో చక్కగా రాణిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతోన్న క్రికెట్ అభిమానులు సద్వినియోగం చేసుకుంటే భావి క్రికెటర్లను చూడవచ్చు. ఇప్పటికే పలు సీనియర్ క్రికెటర్లు తమ రిటైర్‌మెంట్ తర్వాత క్రికెట్ అకాడమీలు స్థాపించి ఎంతో మంది యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు. సచిన్, సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ ఈ కోవకి చెందిన వాళ్లే.