
దుబాయ్: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ గెలుస్తుందని ఆ జట్టు ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ ధీమా వ్యక్తం చేశాడు. పాత ఆటగాడిగా, అనుభవం కలిగిన బౌలర్‌గా మళ్లీ ఐపీఎల్‌లో ఆడటం సంతోషంగా ఉందన్నాడు. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ ఆరేళ్ల కిందట ఐపీఎల్ ఆడాడు. 2014లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున పలు మ్యాచ్‌లు ఆడిన నీషమ్.. తర్వాత మళ్లీ మెగా టోర్నీలో అడుగుపెట్టలేదు. ఇన్నేళ్ల తర్వాత ఈసారి పంజాబ్ తరఫున బరిలోకి దిగనున్నాడు.
ప్రస్తుతం దుబాయ్‌లో జట్టుతో ఉన్న జేమ్స్ నీషమ్ తాజాగా మీడియాతో మాట్లాడాడు. 'సుదీర్ఘ టోర్నీ ఆడటం నాకిదే తొలిసారి. చాలా ఆనందంగా ఉంది. పాత ఆటగాడిగా, అనుభవం కలిగిన బౌలర్‌గా మళ్లీ ఐపీఎల్‌లో ఆడటం సంతోషంగా ఉంది. అందుకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. గతంలో ఢిల్లీ తరఫున ఆడాను. అయితే అప్పుడెలా ఆడాలనే విషయంపై నాకు స్పష్టమైన అవగాహన లేక ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడు ఆ అవసరం రాదు' అని నీషమ్ అన్నాడు.
ఈసారి జరిగే ఐపీఎల్ కోసం స్పష్టమైన ప్రణాళిక, ఆలోచనలతో బరిలోకి దిగబోతున్నట్లు జేమ్స్ నీషమ్ తెలిపాడు. తన అనుభవాన్ని, జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటానన్నాడు. ఈ సీజన్‌లో తమ జట్టులో క్రిస్ గేల్, గ్లెన్ మాక్స్‌వెల్, కేఎల్ రాహుల్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారని, దాంతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కచ్చితంగా విజేతగా నిలుస్తుందనే ధీమా వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ టోర్నీ ఆరంభం నుంచీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంఛైజీ ఆడుతున్నా.. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. ఎంత మంది ఆటగాళ్లు, కెప్టెన్లు, కోచ్‌లు మారినా సరైన ఫలితం దక్కడం లేదు. దీంతో ఈసారి టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేను జట్టు ప్రధాన కోచ్‌గా నియమించుకుంది. అతడి సారథ్యంలో ప్రస్తుతం కింగ్స్ ఆటగాళ్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు. ఇక టోర్నీ ఆరంభ మ్యాచ్ ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత కింగ్స్ ఎలెవెన్ రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.