ప్లాష్‌బ్యాక్ 2019: కలిసొచ్చిన కూతురు 'సమైరా'.. ఈ ఏడాది 'హిట్‌మ్యాన్' హిట్టే!!

హైదరాబాద్: టీమిండియా ఈ సంవత్సరం వరుస విజయాలు సాదిస్తుందంటే కారణం 'హిట్‌మ్యాన్' ఓపెనర్ రోహిత్ శర్మ. ఒంటిచేత్తో విజయాలు అందించి ఈ ఏడాది టీమిండియాను తిరుగులేని స్థితిలో నిలిపాడు. ఇన్నింగ్స్ నెమ్మదిగా ఆరంభించినా.. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే ప్రత్యర్థి బౌలర్లను చీల్చిచెండాడుతున్నాడు. మైదానంలోకి దిగాదంటే హాఫ్ సెంచరీ, సెంచరీ, డబుల్ సెంచరీలు చేసుకుంటూ పోతున్నాడు. 2019లో రోహిత్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. కూతురు 'సమైరా' పుట్టిన శుభవేళ ఏడాదంతా 'హిట్‌మ్యాన్' హిట్టే అయ్యాడు.

సిడ్నీలో సెంచరీ:
రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దె గతేడాది డిసెంబర్ 31న ఓ అమ్మాయికి జన్మనిచ్చింది. ఆసీస్ పర్యటనలో ఉన్న రోహిత్.. విషయం తెలియగానే ముంబైకి చేరుకున్నాడు. ఈ సంవత్సరం జనవరి 6న తన కూతురు పేరు 'సమైర' అని ట్విటర్‌లో తెలిపాడు. మూడు రోజుల్లోనే ఆస్ట్రేలియాకు వెళ్లి సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేసాడు. అప్పటి నుంచి మొదలైన హవా తాజా వెస్టిండీస్ సిరీస్ వరకు కొనసాగింది.

ముంబైని విజేతగా నిలిపాడు:
ఈ ఏడాది ఐపీఎల్‌లో పరుగుల వరద పారించాడు. 14 మ్యాచ్‌ల్లో 405 పరుగులు చేశాడు. అంతేకాదు అద్భుత నాయకత్వంతో ముంబై ఇండియన్స్ జట్టును ముందుండి నడిపించాడు. ముంబై సమిష్టి ప్రదర్శనతో ఫైనల్ చేరింది. 2018లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మూడోసారి ఆ కప్పు గెలిచి జోరుమీదున్నాడు. అందరూ చెన్నై గెలుస్తుందనే భావనలో ఉన్నారు. అయితే ఉత్కంఠ పోరులో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముంబైని విజేతగా నిలిపాడు. దీంతో ఎక్కువ సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టుగా ముంబై చరిత్ర సృష్టించింది.

ఐదు శతకాలతో చరిత్ర:
ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ ప్రభంజనమే సృష్టించాడు. ఐదు శతకాలతో చెలరేగాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రల్లోకెక్కాడు. ప్రపంచకప్‌లో నాలుగు అత్యధిక శతకాలు చేసిన లంక మాజీ ఆటగాడు కుమార సంగక్కరను అధిగమించాడు. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లపై శతకాలు చేసాడు. అయితే కీలక సెమీస్ మ్యాచులో మాత్రం విఫలమయ్యాడు.

ఓపెనర్‌గా కొత్త అవతారం:
ప్రపంచకప్ తర్వాత టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్ళింది. అనంతరం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ ఓపెనర్ అవతారం ఎత్తాడు. తొలి మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు బాదాడు. తర్వాత మూడో టెస్టులో ద్విశతకంతో మెప్పించాడు. ఈ సిరీస్‌కు ముందు రోహిత్ టెస్టుల్లో రాణించలేకపోయాడు. దీంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో విఫలమయ్యే సమస్యను కూడా అధిగమించాడు.

హాఫ్ సెంచరీతో ముగింపు:
బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో మోస్తరుగా రాణించాడు. ఇటీవలే ముగిసిన వెస్టిండీస్ టీ20, వన్డే సిరీస్‌లో మెరిశాడు. విశాఖ స్టేడియంలో రెండో వన్డేలో భారీ శతకం (159) బాదాడు. నిర్ణయాత్మక మూడో మ్యాచ్ 63 పరుగులతో అదరగొట్టాడు. ఈ సంవత్సరం కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి పోటీగా పరుగులు చేసాడు. 2019లో టీమిండియాకు చివరి మ్యాచ్ అయిన కటక్ వన్డేలో హాఫ్ సెంచరీ చేసి రోహిత్ ఈ ఏడాదిని అద్భుతంగా ముగించాడు.

జయసూర్య రికార్డు బద్దలు:
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఓపెనర్‌గా ఒక క్యాలెండర్ ఇయర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును రోహిత్ తన ఖాతాలో వేసుకున్నాడు. 22 ఏళ్ల పాటు పదిలంగా ఉన్న శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య రికార్డును బద్దలు కొట్టాడు. 1997లో జయసూర్య అన్ని ఫార్మాట్లలో కలిపి ఆ క్యాలెండర్ ఇయర్‌లో 2,387 పరుగులు చేసాడు.

బ్రాండ్‌లోనూ టాపే:
ప్రపంచకప్‌లో ఐదు శతకాలతో చెలరేగడంతో రోహిత్ బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. రోహిత్ ప్రస్తుతం 20కి పైగా వ్యాపార ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. ఏడాదికి సుమారు రూ.75 కోట్లకు పైనే సంపాదిస్తాడట. పలు బ్రాండ్ వస్తువులకు యాడ్ షూటింగ్‌లో పాల్గొనాలంటే రోజుకు కనీసం రూ.ఒక కోటి తీసుకుంటాడని సమాచారం తెలుస్తోంది. మొత్తానికి కూతురు రోహిత్ శర్మకు కలిసొచ్చిందనే చెప్పాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications