అరేయ్ బుడ్డోడా.. హైప్ చూసి పొంగిపోవద్దు: స్టార్ క్రికెటర్
ఐపీఎల్ 2026 సీజన్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏకైక పేరు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను ఓ స్కూల్ స్థాయి ప్లేయర్‌లా ఆడుకుంటున్న తీరు క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న ఈ బీహార్ కుర్రాడు.. తనలో ఏమాత్రం భయం లేదని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఆడిన 4 మ్యాచ్‌ల్లోనే 200 పరుగులు చేయడమే కాకుండా అందులో రెండు హాఫ్ సెంచరీలు కేవలం 15 బంతుల్లోనే బాది రికార్డు సృష్టించాడు.
పొలార్డ్ ప్రశంసల వెనుక ఉన్న ఆందోళన
ముంబైఇండియన్స్, ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్ ఈ యువ సంచలనంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కీరన్ పొలార్డ్ మాట్లాడుతూ.. "15 ఏళ్ల వయసులో నేను ఇంకా స్కూల్ చదువుకుంటూ క్లబ్ క్రికెట్ ఆడాను. కానీ వైభవ్ మాత్రం అంతర్జాతీయ స్థాయి బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటున్నాడు" అని ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే ఇంత చిన్న వయసులో వచ్చే ఈ అద్భుతమైన గుర్తింపు ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందో.. అంతే ప్రమాదకరమని కూడా పొలార్డ్ అభిప్రాయపడ్డాడు.

అసలైన సవాలు ఎప్పుడు మొదలవుతుందంటే?:
కీరన్ పొలార్డ్ తన అనుభవంతో ఓ ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేశాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ఆత్మవిశ్వాసం ఆకాశంలో ఉందని.. అతని టైమింగ్ అద్భుతంగా ఉందని, అందుకే అందరూ అతని వెనుక తిరుగుతున్నారని పొలార్డ్ తెలిపాడు. అయితే టోర్నమెంట్ ముందుకు సాగుతున్న కొద్దీ బౌలర్లు వైభవ్ బలహీనతలను విశ్లేషించి కొత్త వ్యూహాలతో వస్తారని.. అప్పుడే అసలైన పరీక్ష మొదలవుతుందని హెచ్చరించాజు. ఆ సమయంలో వరుసగా ఒకటి లేదా రెండు వైఫల్యాలు ఎదురైతే.. ఇప్పుడు పొగిడే వారే అతడిని మర్చిపోయే ప్రమాదం ఉందని పొలార్డ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
నిలకడ, మానసిక దృఢత్వం:
యువ ఆటగాళ్లు విఫలమైనప్పుడు వారిని చిన్నచూపు చూడకుండా, అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పొలార్డ్ సూచించాడు. "మనం కేవలం వైభవ్ గెలిచినప్పుడు మాత్రమే వెంట ఉండటం కాదు.. అతను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అతనికి ప్రోత్సాహాన్ని అందించాలి" అని పేర్కొన్నాడు. హైప్, సోషల్ మీడియా ప్రశంసల కంటే క్రికెట్ మీద దృష్టి పెట్టడం, వైఫల్యాలను తట్టుకుని నిలబడటం వైభవ్ వంటి యువ ప్రతిభావంతులకు చాలా అవసరమని కీరన్ పొలార్డ్ స్పష్టం చేశాడు.
భారత క్రికెట్ భవిష్యత్తుపై ఆశలు
పొలార్డ్ మాటలు విశ్లేషిస్తే.. వైభవ్ సూర్యవంశీ లాంటి టాలెంట్‌ను కాపాడుకోవడం భారత క్రికెట్‌కు ఎంతో ముఖ్యం. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం, సీనియర్ ఆటగాళ్లు వైభవ్‌కు మానసిక స్థైర్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక సీజన్ అద్భుతంలా కాకుండా, సుదీర్ఘ కాలం పాటు భారత జట్టుకు ఆడే సత్తా ఉన్న ఈ ఆటగాడిని జాగ్రత్తగా తీర్చిదిద్దాలని క్రీడా విశ్లేషకులు కూడా కోరుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications