
హైదరాబాద్: చాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న చైనా ఓపెన్ సూపర్ సిరిస్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. టోర్నీలో భాగంగా క్వార్టర్స్‌లో జపనీస్ షట్లర్, వరల్డ్ ఛాంపియన్ కెంటో మొమొటాతో శుక్రవారం తలపడిన కిదాంబి శ్రీకాంత్ పేలవరీతిలో 9-21, 11-21 తేడాతో ఓడిపోయాడు.
కెంటో మొమొటాతో 3-7 ముఖాముఖి రికార్డుని కలిగిన ఉన్న కిదాంబి శ్రీకాంత్ ఈ ఏడాది ఇప్పటికే మలేషియా ఓపెన్, ఇండోనేషియా ఓపెన్‌లో కూడా ఇతడి చేతిలో ఓడిపోవడం విశేషం. గతేడాది అక్రమ కాసినో ఆడిన కారణంగా కెంటో మొమొటా ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు.
నిషేధం అనంతరం అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లోకి అడుగుపెట్టిన కెంటో మొమొటా అద్భుతమైన ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. భారీ అంచనాల మధ్య టోర్నీలోకి అడుగుపెట్టిన కిదాంబి శ్రీకాంత్.. గురువారం రెండో రౌండ్‌లో థాయ్‌లాండ్ షట్లర్ సుపన్యుపై 21-12, 15-21, 24-23 తేడాతో గెలిచి క్వార్టర్స్‌లోకి అడుగపెట్టాడు.
అయితే, శుక్రవారం తొలి సెట్ ఆరంభంలోనే 1-5తో వెనకబడిన శ్రీకాంత్ ఆ తర్వాత పుంజుకుని ఆధిక్యాన్ని 4-5కి తగ్గించినప్పటికీ... చూస్తుండగానే మొమొటా 19-6తో తిరుగులేని స్థితికి చేరుకుని తొలి సెట్‌లో గెలుపొందాడు. ఇక, రెండో సెట్‌లో శ్రీకాంత్... మొమొటా ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయాడు.
రెండో సెట్‌లోనూ 3-4తో శ్రీకాంత్ నిలిచిన దశలో వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించిన మొమొటా ఏకంగా 13-3తో ఆధిపత్యం చెలాయించాడు. దీంతో ఒత్తిడికి గురైన భారత షట్లర్‌కి పేలవ ఆటతీరుతో మ్యాచ్‌ని చేజార్చుకున్నాడు.