
హైదరాబాద్: కియో సూపర్ లీగ్‌లో భారత క్రీడాకారిణి స్మృతీ మంధాన అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌లో వెస్ట్రన్ స్ట్రోమ్ తరపున బరిలోకి దిగిన మంధాన మహిళల టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన బ్యాట్స్ ఉమెన్‌గా చరిత్ర సృష్టించింది.
ఆదివారం లాఫ్‌బారఫ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో మంధాన 18 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీని నమోదు చేసింది. తనదైన శైలిలో సిక్స్‌తో మంధాన హాఫ్ సెంచరీని పూర్తి చేయడం విశేషం. దీంతో సోఫీ డివైన్(న్యూజిలాండ్)తో కలిసి మంధాన సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది.
వర్షం కారణంగా పలుమార్లు అంతరాయం కలిగిన ఈ మ్యాచ్‌ను ఆరు ఓవర్లకు కుదించారు. ఈ క‍్రమంలోనే తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్రన్ స్ట్రోమ్ ఆరు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. మంధాన(59; 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), రాచెల్ ప్రీస్ట్(25; 13 బంతుల్లో 3 సిక్సర్లు) దూకుడుగా ఆడారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లాఫ్‌బారఫ్ ఆరు ఓవర్లలో 67 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన 25 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. 22 ఏళ్ల మంధాన ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కూడా అద్భుత ప్రదర్శన చేస్తోంది.