హైదరాబాద్: న‌్యూజిలాండ్‌తో ఆదివారం నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరిస్ కోసం తుది జట్టు ఎంపిక టీమిండియా కెప్టెన్ కోహ్లీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉండటం, ఓపెనింగ్ స్థానానికి పోటీ పెరిగిన నేపథ్యంలో ఓపెనర్ల ఎంపికపై తర్జనభర్జన పడుతున్నాడు.
కివీస్‌తో తొలి మూడు వన్డేలకు యువ క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను తప్పించి అతని స్థానంలో శిఖర్ ధావన్‌ను సెలక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి బరిలోకి దిగేందుకు ధావన్‌తో పాటు రహానే కూడా సిద్ధంగా ఉన్నాడు. అయితే గత మ్యాచ్‌ల్లో రోహిత్, ధావన్ జోడీ విజయవంతమైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ముంబైలో ప్రారంభమైన తొలి వన్డేకి రహానే బెంచ్‌కే పరిమితం చేశారు. మ్యాచ్‌కి ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో విరాట్ కోహ్లీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. మరికొన్ని నెలల్లో టీమిండియా రెండు విదేశీ పర్యటనలకు వెళ్తుందని విరాట్ కోహ్లీ వెల్లడించాడు.
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్ ముగిశాక శ్రీలంక జట్టు భారత పర్యటనకు వస్తుందని, ఆ తర్వాత వచ్చే జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా వెళ్తుందని ఈ పర్యటనలో దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంటుందన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత వచ్చే జులైలో సుదీర్ఘ సిరీస్ కోసం కోహ్లీసేన ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.
ఆతిథ్య ఇంగ్లాండ్‌తో భారత్ 3 టీ20లు, 3 వన్డేలు, ఐదు టెస్టులు ఆడుతుందని కోహ్లీ చెప్పాడు. దీంతో తీరిక లేని బిజీ షెడ్యూల్‌తో ఆటగాళ్లు అలసిపోతారని దీంతో మంచి ప్రదర్శన చేసే అవకాశాలు కూడా తగ్గుతాయని విరాట్ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై కూర్చొని భవిష్యత్‌లో చర్చించాల్సిన అవసరం ఉందన్నాడు.
ఇక, న్యూజిలాండ్ జట్టును పరిశీలిస్తే జూన్‌లో ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇప్పటి వరకు వాళ్లు ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు ఆడలేదు. వారికి మంచి విశ్రాంతి దొరికిందని, దీంతో వారు మంచి ప్రదర్శన చేసే అవకాశం ఉందని విరాట్ కోహ్లీ పేర్కోన్నాడు. ప్రతి ఒక్కరూ పుంజుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని కోహ్లీ సూచించాడు.
'ముఖ్యంగా పేస్ బౌలర్లు తిరిగి లయ అందుకునేందుకు వారికి తగినంత విశ్రాంతి కావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలు భారత పేస్ విభాగాన్ని మోస్తున్నారు.త్వరలో టెస్టు సిరీస్‌లు ఉన్నందున వారు సన్నద్ధం అయ్యేందుకు తగినంత సమయం ఇవ్వాలనుకుంటున్నాం. బ్యాట్స్‌మెన్లకు కూడా కచ్చితంగా విశ్రాంతినిస్తాం' అని కోహ్లీ అన్నాడు.
అన్ని ఫార్మాట్లలో బౌలర్లపై ఒత్తిడి తగ్గించేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కెప్టెన్ విరాట్ అభిప్రాయపడ్డాడు. బ్యాట్సమెన్‌లతో పోలిస్తే బౌలర్లకు ఇది ఎంతో కష్టమైనదని కోహ్లీ చెప్పుకొచ్చాడు.