క్రికెట్ చరిత్రలో కొందరు ప్లేయర్ల సెలబ్రేషన్స్ ప్రత్యేకంగా నిలిచాయి. శిఖర్ ధావన్ తొడకొట్టడం, రవీంద్ర జడేజా బ్యాటుసాము, కాట్రెల్ ఆర్మీ సెల్యూట్, కెస్రిక్ విలియమ్స్ నోట్ బుక్, ఇమ్రాన్ తాహిర్ మార్‌థాన్ రన్, షంసీ టెలిఫోన్, అర్షదీప్ సింగ్ ఫ్లైట్ సెలబ్రేషన్స్, బంగ్లాదేశ్ క్రికెటర్లు నాగిని స్టెప్పులు.. ఇలా ఎంతో మంది భిన్నంగా మైదానంలో సంబరాలు చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో వెస్టిండీస్ బౌలర్ కెవిన్ సిన్‌క్లియర్ డిఫ్రెంట్‌గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. గాల్లోకి పల్టీలు కొడుతూ అందర్నీ అబ్బురపరచాడు. టెస్టు కెరీర్‌లో తొలి వికెట్ తీసుకోవడంతో అమితానందంతో ఇలా సంబరాలు చేశాడు. కెవిన్ వేసిన బంతిని షాట్‌కు యత్నించిన ఖవాజా స్లిప్‌లో ఉన్న అథెంజ చేతికి చిక్కాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ అభిమానులకు కెవిన్ సెలబ్రేషన్స్ సుపరిచితమే.

మరోవైపు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు కెవిన్ సిన్‌క్లియర్ అర్ధశతకం సాధించాడు. 64 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ 300 మార్క్‌ను దాటడంలో కెవిన్ కీలక పాత్ర పోషించాడు. కాగా, విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. జాషువా డిసిల్వా (79), కవెమ్ హోడ్జ్ (71), కెవిన్ సిన్‌క్లెయిర్ (50), అల్జారీ జోసెఫ్ (32) గొప్పగా పోరాడుతూ జట్టుకు భారీ స్కోరు సాధించారు.
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 289/9 స్కోరుకే డిక్లేర్ చేసింది. 22 పరుగుల వెనుకంజలో ఉండి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం గమనార్హం. అయితే విండీస్ మాదిరిగానే ఆసీస్ ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. 54 పరుగులకే సగం మంది పెవిలియన్‌కు చేరారు. కానీ ఉస్మాన్ ఖవాజా (75; 131 బంతుల్లో), అలెక్స్ కేరీ (65; 49 బంతుల్లో), ప్యాట్ కమిన్స్ (64*; 73 బంతుల్లో) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.
అయితే ఫ్లడ్ లైట్‌లో పింక్ బాల్ మరింత స్వింగ్ అవుతుందనే ఉద్దేశంతో కమిన్స్ ఇన్నింగ్స్‌ను ముందుగా డిక్లేర్ చేశాడు. విండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకు ఆలౌట్ చేయాలనే ప్లాన్‌తో ఈ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. మరి, అతివిశ్వాసంతో తీసుకున్న ఆసీస్ వ్యూహాలు ఫలిస్తాయో లేదో చూడాలి. కాగా, తొలి టెస్టులో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో విజయం సాధించింది.