
బెంగళూరులో ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలానికి వచ్చి పాన్ కార్డు పొగొట్టుకున్నాడు ఓ దిగ్గజ క్రికెటర్. దీంతో తనకు సాయం చేయాలని ట్విటర్‌లో పోస్ట్ పెట్టాడు. దీనికి స్పందించిన భారత ఆదాయపు పన్ను శాఖ ట్విట్టర్‌లో అతని సమస్యకు పరిష్కారం కూడా చూపించింది. అసలు ఆ పాన్ కార్డు పొగొట్టున్న వ్యక్తి ఎవరంటే ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్. ప్రస్తుతం ఓ ప్రముఖ క్రీడా చానెల్‌లో క్రికెట్ కామెంటేటర్‌గా పని చేస్తున్న పీటర్సన్ ఈ నెల 12, 13వ తేదీలలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం కోసం ఇండియా వచ్చాడు. విజయవంతంగా తన విధులను కూడా పూర్తి చేసుకున్నాడు. కానీ ఈ క్రమంలో తన పాన్ కార్డును పొగొట్టుకున్నాడు. దీంతో పాన్ కార్డు తిరిగి పొందడానికి తనకు సాయం చేయాలని ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు.
దీంతో తన పాన్ కార్డు ఎక్కడో పోయిందని, తనకు సాయం చేయాలని పీటర్సన్ కోరాడు. కొన్ని అవసరాల కోసం పాన్ కార్డు అవసరం చాలా ఉందని చెప్పుకొచ్చిన పీటర్సన్ దానిని తిరిగి ఎలా పొందాలో తెలియచేయగలరని రాసుకొచ్చాడు. దీంతో పీటర్సన్ ట్వీట్‌పై స్పందించిన భారత ఆదాయ శాఖ డియర్ పీటర్సన్ మీకు సాయం చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపింది. పీటర్సన్ దగ్గర అతని పాన్‌కార్డు వివరాలు ఉంటే తాము ఇచ్చే వెబ్‌సైట్ లింక్‌ను ఓపెన్ చేసి పాన్ కార్డు రీ ప్రింట్‌కోసం ప్రయత్నించాలని సూచించింది. ఇందుకు తమ వెబ్‌సైట్ లింక్‌ను కూడా ఆదాయ శాఖ ఇచ్చింది. ఒకవేళ పాన్‌కార్డు వివరాలు అందుబాటులో లేకపోతే రీప్రింట్ కోసం తమ శాఖకు దరఖాస్తు చేసుకోవాలని పీటర్సన్‌కు భారత ఆదాయ పన్ను శాఖ సూచించింది. కాగా తన ట్వీట్‌కు స్పందించి తగిన సమాచారం ఇచ్చిన భారత ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కెవిన్ పీటర్సన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు.
కాగా ఈ నెల 12, 13వ తేదీల్లో ఐపీఎల్ మెగా వేలంలో ముగిసింది. మొత్తం 600 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనగా 204 మంది అమ్ముడుపోయారు. మొత్తం 10 జట్లు తమకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.