
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్, క్రికెట్ విశ్లేషకుడు కెవిన్ పీటర్సన్ నిన్న ఆర్ఆర్ వర్సెస్ ఢిల్లీ మధ్య చివరి ఓవర్లో జరిగిన హైడ్రామాపై సీరియస్‌గా స్పందించాడు. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, అసిస్టెంట్ కోచ్ ఆమ్రేలు క్రికెట్లో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడానికి అసలు తమ గురించి తాము ఏమనుకుంటున్నారు అంటూ కడిగిపారేశాడు. అంపైర్ తప్పిదం కంటే, ఢిల్లీ టీం ప్రవర్తననే తనకు నచ్చలేదన్నాడు.
ఆట మధ్యలో కెప్టెన్ రిషబ్ పంత్.. వచ్చేయండంటూ సైగ చేయడం.. అలాగే సహాయ కోచ్ ఆమ్రేను స్టేడియంలోకి పంపించడాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు. రిషబ్ పంత్, ఆమ్రే ప్రవర్తన వల్ల.. ఢిల్లీ ప్లేయర్ పావెల్ ఏకాగ్రతకు తీవ్ర భంగం కలిగే ఉండొచ్చన్నాడు. అదే వారి కొంప ముంచిందని అభిప్రాయపడ్డాడు.
ఈ సంఘటన జరిగే సమయంలో ఢిల్లీ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ లేడు. పాంటింగ్ కుటుంబ సభ్యులలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో అతను ఐసోలేషన్‌లో ఉన్నాడు. పాంటింగ్ డగౌట్లో ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని పీటర్సన్ పేర్కొన్నాడు. కోచ్ ఆమ్రేను రిషబ్ పంత్ గ్రౌండ్లోకి పంపించడాన్ని తప్పుపడుతూ పంత్ వద్దకు వెళ్లి జోస్ బట్లర్ వాదించడాన్ని కూడా తాను సమర్థిస్తున్నా అని పీటర్సన్ తెలిపాడు. ఆ హక్కు ఒక ఫీల్డర్‌గా జోస్ బట్లర్‌కు ఉంటుందని పేర్కొన్నాడు.
సీనియర్ వ్యక్తి అయి ఉండి కూడా అంత దురుసుగా గ్రౌండ్లోకి వెళ్లిన ఆమ్రే ప్రవర్తనను కూడా కెవిన్ తప్పుపట్టాడు. అసలింతకు వారు తమ గురించి ఏమనుకుంటున్నారో అర్థం కావడం లేదని, ఈ ఘటన చాలా పెద్ద పొరపాటు అన్నాడు. ఒక కోచ్ మైదానంలోకి పరిగెత్తడం, అంపైర్‌తో వాదించడం తన ఉద్దేశంలో అతి పెద్ద తప్పు అంటూ స్పష్టం చేశాడు. ఇలాంటి ఘటన క్రికెట్లో మళ్లీ ఎప్పుడూ జరగకూడదని ఆశిస్తున్నానని తెలిపాడు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ చివరి ఓవర్లో మూడో బంతికి ఫుల్ టాస్‌ను అంపైర్ నితిన్ మీనన్ నోబాల్‌గా ప్రకటించకపోవడంతో ఢిల్లీ కెప్టెన్ పంత్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా ఆడాల్సిన అవసరం లేదు పావెల్.. వాళ్లకు గెలుపు ఇచ్చేస్తున్నాం.. వచ్చేసేయ్ అంటూ డగౌట్ నుంచి పంత్ సైగ చేయడంతో పాటు, అసిస్టెంట్ కోచ్ ఆమ్రే.. ఏకంగా స్టేడియంలోకి వెళ్లే అంపైర్లతో గొడవపెట్టుకున్నాడు.