హైదరాబాద్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఒకే రోజు రెండుసార్లు అరెస్ట్ అయ్యాడు. ఒకసారి జెనీవా ఎయిర్‌పోర్ట్‌లో.. మరోసారి లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, పీటర్సన్‌కు ఇష్టమైన గోల్ఫ్ ఆటనే అతడిని అరెస్ట్ అయ్యేలా చేసింది.
తొలిసారి జెనీవా ఎయిర్‌పోర్టులో పీటర్సన్‌ను అరెస్ట్ చేసి తాత్కాలికంగా సెల్‌లో ఉంచారు. ఇంతకీ అతను చేసిన తప్పేంటో తెలుసా? ఎయిర్‌పోర్టు నిబంధనలకు విరుద్దంగా పీటర్సన్ గోల్ఫ్ బంతిని ముందుకు ఊపారు. దీంతో జెనీవా పోలీసులు అరెస్టు చేసి అతడిని కొద్దీసేపు సెల్‌లో ఉంచారు.
ఈ విషయాన్ని కెవిన్ పీటర్సన్ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఇంత జరిగినా పీటర్సన్ మాత్రం మారలేదు. లండన్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత కూడా ఇలాగే వ్యవహరించాడు. దీంతో అక్కడి పోలీసులు మరోసారి పీటర్సన్‌ను అదుపులోకి తీసుకొని వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ అనంతరం కెవిన్ పీటర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు.