
హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌ను ఆస్ట్రేలియా 3-0తో మళ్లీ సొంతం చేసుకుంది. పెర్త్‌లోని వాకా స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌ను ఇంకా రెండు టెస్టులు మిగిలుండగానే ఆసీస్ సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శనకు ఆ జట్టు కెప్టెన్ జోరూట్‌ను బాధ్యుణ్ని చేస్తూ ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఓసారి పీటర్సన్ అద్దంలో చూసుకుంటే బాగుంటుందంటూ అభిమానులు చురకలంటించారు.
జో రూట్ వాటర్ గన్‌తో ఉన్న మార్ఫింగ్ చేసిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన పీటర్సన్ 'కెప్టెన్ ఫెంటాస్టిక్' అని కామెంట్ పోస్టు చేశాడు. ఈ ట్వీట్‌పై ఇంగ్లాండ్ అభిమానులు పీటర్సన్ తీరు సరిగాలేదని తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.
'నా పాకెట్‌లో కూడా ఒక పిస్టల్ ఉంది. దాన్ని నీపై గురిపెడతా' అని ఒక అభిమాని ట్వీట్ చేశాడు. 'గతంలో ఆసీస్ చేతిలో వైట్‌వాష్ అయిన ఇంగ్లండ్ జట్టులో నువ్వు ఎప్పుడు లేవా.. నిన్ను ఒకసారి అద్దంలో చూసుకుంటే బాగుంటుంది.. నీ వ్యక్తిగత ప్రదర్శనతో ఇంగ్లండ్ జట్టుకు విజయాలు అందించలేదనే విషయం తెలుసుకో' అని మరో అభిమాని స్పందించాడు.
పెర్త్ టెస్టు ఓటమితో ఐదు టెస్టుల యాషెన్ సిరిస్‌ను ఇంగ్లాండ్ 0-3 తేడాతో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఆసీస్‌తో పెర్త్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 41 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైంది. ఇరు జట్ల మధ్య మెల్ బోర్న్ వేదికగా నాలుగో టెస్టు డిసెంబర్ 26(మంగళవారం) ప్రారంభం కానుంది.