కేరళ క్రికెట్ లీగ్ లో ఓ అద్భుతం చోటు చేసుకుంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటర్ సల్మాన్ నిజార్ రికార్డు నెలకొల్పాడు. సునామీ బ్యాటింగ్ ప్రదర్శనతో కాలికట్ గ్లోబ్‌స్టార్స్ జట్టుకు విజయాన్ని అందించాడు. త్రివేండ్రం రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో గ్లోబ్ స్టార్స్ 13 పరుగుల తేడాతో గెలుపొందింది. సల్మాన్ 26 బంతుల్లో అజేయంగా 86 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చాడు.
కేరళ క్రికెట్ లీగ్ లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ లో కాలికల్ గ్లోబల్ స్టార్స్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు ప్రీతీష్ పవన్- 7, కున్నమ్మాళ్- 11 పరుగులు చేసి అవుట్ అయ్యారు. టాప్ ఆర్డర్ బ్యాటర్ మురుథుంగల్ అజినాస్ 50 బంతుల్లో 51 పరుగులతో రాణించాడు. అఖిల్ స్కారియా- 6. సురేష్ సచిన్- 8 పరుగులు చేశారు. 76 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్ కు దిగాడు కేప్టెన్ సల్మాన్ నిజార్. బౌలర్లకు చుక్కలు చూపాడు.

అతని ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు నమోదయ్యాయి. 12 బంతుల్లో 67 పరుగులు కొట్టాడంటే అతని ఇన్నింగ్ ఏ రేంజ్ సాగిందో అర్థం చేసుకోవచ్చు. బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు సల్మాన్. చివరి 12 బంతుల్లో 6, 6, 6, 6, 6, 1, 6, 6, 6, 6, 6, 6. పరుగులు రాబట్టుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఏకంగా 40 పరుగులు పిండుకున్నాడు. మిడ్ వికెట్, ఎక్స్‌ట్రా కవర్, లాంగ్ ఆన్, డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్.. ఇలా గ్రౌండ్ మొత్తం సిక్సర్లతో హోరెత్తిపోయింది.
19వ ఓవర్‌లోకి గ్లోబ్ స్టార్ ఇన్నింగ్ అడుగుపెట్టినప్పుడు జట్టు స్కోరు 115/6. అప్పటికి సల్మాన్ 13 బంతుల్లో 17 పరుగులు, అన్‌ఫాల్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఐపీఎల్ స్టార్ అయిన బాసిల్ థంపి బౌలింగ్‌లో సల్మాన్ వరుసగా అయిదు సిక్సర్లు బాదాడు. అభిజిత్ ప్రవీణ్ వేసిన చివరి ఓవర్‌లోనూ అదే దూకుడు కొనసాగింది. తొలి బంతిని సల్మాన్ లాంగ్ ఆఫ్ మీదుగా సిక్సర్ కొట్టాడు. దీంతో ఒత్తిడికి గురైన బౌలర్ ఓ వైడ్, రెండు నో బాల్స్ వేశాడు. ఫలితంగా ఎక్స్ ట్రా పరుగులు, బంతులు లభించాయి.
ఆ తర్వాత వరుసాగా మరో అయిదు సిక్సర్లు బాదాడు. దీంతో గ్లోబ్ స్టార్ 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. భాసిల్ థంపి 4 ఓవర్లల్లో 56 పరుగులు సమర్పించుకున్నాడు. అభిజిత్ ప్రవీణ్ ఒక్క ఓవర్ కే 40 పరుగులు ఇచ్చుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన అదాని త్రివేండ్రం రాయల్స్.. ధీటుగా ఆడింది గానీ మ్యాచ్ గెలవలేకపోయింది. 19.3 ఓవర్లల్లో 173 పరుగులకు ఆలౌట్ అయింది. అఖిల్ స్కారియా మూడు వికెట్లు పడగొట్టాడు.