
హైదరాబాద్: కెన్యా క్రికెట్ భారీ సంక్షోభంలో పడింది. నమీబియా వేదికగా జరిగిన వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ 2లో కెన్యా జట్టు ఘోర ప్రదర్శన చేసిన ఆ దేశ క్రికెట్‌ను సంక్షోభంలోకి నెట్టింది. డివిజన్ 2టోర్నీలో భాగంగా మొత్తం ఆరు జట్లు పాల్గొన్నాయి. యుఏఈతో జరిగిన మ్యాచ్‌లో కెన్యా 218 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైంది.
ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ కెఫ్టెన్ రాకెప్ పటేల్ కెఫ్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఆ తర్వాత కెప్టెన్ బాటలోనే కెన్యా జట్టు కోచ్, బోర్డు అధ్యక్షుడు జాకీ జాన్ మహ్మద్ సహా పలువురు తమ పదవులకు రాజీనామాలు చేశారు. నమీబియాలో జరిగిన ప్రపంచకప్ లీగ్ డివిజన్-2 టోర్నమెంట్‌లో కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా కెన్యా విజయం సాధించలేకపోయింది.
ఈ టోర్నీలో కెన్యా జట్టు చివరి స్థానంలో నిలిచిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో గత నెలలో జింబాబ్వేతో జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫై మ్యాచ్‌లోనూ కెన్యా జట్టు చిత్తుగా ఓడి వరల్డ్ కప్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోయింది. ఈ ఘోర ఓటమికి నైతిక బాధ్యతగా తొలుత కెప్టెన్ తన పదవికి రాజీనామా చేశాడు.
ఆపై కోచ్ థామస్ ఓడియో కూడా తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప‍్రకటించారు. కాగా, ప్రపంచ క్రికెట్‌లో ఒక క్రికెట్ బోర్డుకు తొలిసారి మహిళా అధ్యక్షురాలిగా సేవలందిస్తున్న కెన్యా బోర్డు ప్రెసిడెంట్ జాకీ జాన్ మహ్మద్, బోర్డు డైరెక్టర్ ఆఫ్ డెవలప్‌మెంట్ అభిజిత్ సర్కార్‌లు వరుసపెట్టి రాజీనామాలు చేశారు.
ఫలితంగా కెన్యా క్రికెట్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటికే సరైన గుర్తింపు, ఆదరణ లేకపోవడంతో పాటు ఆర్థికంగానూ కెన్యా క్రికెట్ బోర్డు ఇబ్బందులను ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితిలో ఈ మూకుమ్మడి రాజీనామాలతో స్థానిక క్రికెట్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
తాజా సంక్షోభం నేపథ్యంలో 30 రోజుల్లో బోర్డులో ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది.