హైదరాబాద్: పూణె వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన కేదార్ జాదవ్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ఆట తీరు బాగుందని, ఇదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం తక్కువగా ఉన్న జాదవ్, ఇంగ్లాండ్ వంటి జట్టుపై ఆడిన తీరు అందరినీ కట్టిపడేసిందని అన్నాడు.
కెప్టెన్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ కంటే జాదవ్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతంగా ఉందని గంగూలీ కొనియాడాడు. 'జాదవ్ ప్రదర్శన నిజంగా అసాధారణం. చేధనలో జాదవ్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. నా దృష్టిలో కోహ్లి కంటే జాదవ్‌నే మెరుగ్గా ఆడాడు. 63/4 పరుగుల వద్ద తీవ్ర ఒత్తిడిలో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 31/1, 63/4 పరుగుల వద్ద బ్యాటింగ్ చేయడం విభిన్నమైంది' అని గంగూలీ అన్నాడు.

'మన విజయాల్లో ఎప్పుడూ కోహ్లి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ మాత్రం జాదవ్ గురించి కచ్చితంగా మాట్లాడిల్సిన అవసరం ఉంది. భారత జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో జాదవ్ కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతోనే భారత్‌కు విజయం సాధ్యమైంది. ఇక్కడ మొత్తం క్రెడిట్ జాదవ్‌కు ఇవ్వాల్సిందే' అని గంగూలీ పేర్కొన్నాడు.
కెప్టెన్ కోహ్లీతో కలిసి కేదార్ జాదవ్ ఐదో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 65 బంతుల్లో సెంచరీ సాధించి భారత తరుపున అత్యంత వేగంగా సెంచరీని నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేదార్ జాదవ్ ఆరో స్ధానంలో నిలిచాడు. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించినందుకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఇదిలా ఉంటే టీమిండియా విజయంలో తన పాత్ర ఉండటంపై జాదవ్ హర్హం వ్యక్తం చేశాడు. భారత విజయాల్లో తన పాత్ర ఉండాలని ఎప్పుడూ కోరుకుంటానని, అందులోనూ సొంత మైదానంలో సెంచరీ చేసి జట్టుకు చక్కటి విజయాన్ని అందివ్వడం మరచిపోలేని అనుభూతిగా పేర్కొన్నాడు.
తన కుటుంబ సభ్యులు సమక్షంలో కీలక ఇన్నింగ్స్ ఆడటం ఆనందంగా ఉందన్నాడు. తాను చాలాసార్లు విరాట్ కోహ్లి కలిసి బ్యాటింగ్ చేసే అవకాశాన్ని కోల్పోయానని, ఈ మ్యాచ్ ద్వారా ఆ లోటు తీరిందని మ్యాచ్ ముగిసిన అనంతరం జాదవ్ వ్యాఖ్యానించాడు.