టీమిండియా సీనియర్ క్రికెటర్ కేదార్ జాదవ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 39 ఏళ్ల జాదవ్ టీమిండియా సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఓ దశలో వన్డే జట్టులో కీలక ఆటగాడిగా సత్తాచాటాడు. బ్యాటింగ్‌తో పాటు బంతితోనూ మెరుస్తూ విలువైన ప్లేయర్‌గా ఎదిగాడు.
అయితే ఫామ్ లేమి, మైదానంలో చురుకుగా కదలలేక క్రమంగా భారత జట్టు నుంచి దూరమయ్యాడు. అయితే కేదార్ జాదవ్‌ను గోల్డెన్ హ్యాండ్‌గా అభివర్ణిస్తారు. జట్టుకు వికెట్ కావాల్సిన స్థితిలో పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా బంతిని అందుకొని ప్రత్యర్థికి జోరుకు బ్రేక్‌లు వేయడంలో కేదార్ సిద్ధహస్తుడు. భారత్ తరఫున 73 వన్డేలు ఆడాడు. 52 ఇన్నింగ్స్‌ల్లో 1389 పరుగులు సాధించాడు. రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు బాదాడు.

అంతేగాక 5.16 ఎకానమీ రేటుతో 27 వికెట్లు పడగొట్టాడు. ఇక బ్లూ జెర్సీ ధరించి తొమ్మిది టీ20లు ఆడిన జాదవ్ నిరాశపరిచాడు. 20 సగటుతో 122 పరుగులే చేశాడు. టీమిండియా తరఫున 2014లో అరంగేట్రం చేసిన అతను 2020 ఫిబ్రవరిలో చివరిగా మ్యాచ్ ఆడాడు. కాగా, కేదార్ జాదవ్ తన రిటైర్మెంట్‌ను ధోనీ స్టైల్‌లో ప్రకటించాడు. 2020 ఆగష్టు 15న ధోనీ సోషల్ మీడియా వేదికగా 'మద్దతు ఇచ్చిన అభిమానులకు ధన్యవాదాలు. 1929 గంటల నుంచి రిటైర్మెంట్ అయినట్లుగా పరిగణించండి' అని ధోనీ పేర్కొన్న విషయం తెలిసిందే.
అదే తరహాలో కేదార్ జాదవ్ కూడా పోస్ట్ చేశాడు. ''నా కెరీర్‌లో మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. 1500 గంటల నుంచి అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ అయినట్లుగా పరిగణించండి'' అని జాదవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌కు తన కెరీర్‌లోని కొన్ని ఫొటోలను జోడించాడు. కాగా, ఐపీఎల్‌లో కేదార్ జాదవ్ స్టార్ ప్లేయర్. తన కెరీర్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు.
సీఎస్కకే తరఫున టాప్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఫినిషర్‌గా ఎన్నో మ్యాచ్‌ల్లో సత్తాచాటాడు. కాగా, 2023 సీజన్‌లో ఆర్సీబీ తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు. 2024 సీజన్‌కు ముందు కేదార్‌ను బెంగళూరు ఫ్రాంచైజీ వదులుకుంది. అయితే వేలానికి వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కోసం ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఐపీఎల్‌లో 95 మ్యాచ్‌లు ఆడిన కేదార్ 1208 పరుగులు చేశాడు.