
హైదరాబాద్: బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అద్భుతాలు చూడాలంటే టీ20ల్లోనే చెల్లుబాటు అవుతుంది. ఈ షార్ట్ ఫార్మాట్ రాకతో ఫీల్డింగ్ ప్రమాణాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. సిక్స్‌గా వెళ్తున్న బంతిని బౌండరీ లైన్ దగ్గర సూపర్ మాన్ ఫీట్‍లు చేసి గాల్లోకి ఎగిరి అందుకోవడం.. క్షణాల్లో మరో ఫీల్డర్‌కి క్యాచ్‌గా విసిరేయడం.. వంటివి చూస్తూనే ఉన్నాం. ఇదే తరహాలో.. తాజాగా మరో అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శన వెలుగులోకి వచ్చింది.
శ్రీలంకతో పల్లెకల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో.. ఇంగ్లాండ్ ఫీల్డర్ జెన్నింగ్స్, వికెట్ కీపర్ బెన్ ఫోక్స్‌లు సంయుక్తంగా క్యాచ్‌ను పంచుకున్నారు. అరుదుగా జరిగే ఈ ఫీట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ కరుణరత్నె బంతిని స్వీప్ చేశాడు.
బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి.. కీపర్ పక్క నుంచి వెళ్తుండగా.. బ్యాట్స్‌మెన్‌కి సమీపంలో (ఫైన్‌లెగ్) ఫీల్డింగ్ చేస్తున్న జెన్నింగ్స్ వేగంగా డైవ్ చేస్తూ బంతిని తన ఎడమ చేతితో కీపర్ వైపు నెట్టాడు. దీంతో.. గాల్లోకి లేచిన బంతిని వికెట్ కీపర్ ఫోక్స్ ఎలాంటి తడబాటు లేకుండా క్యాచ్‌గా అందుకున్నాడు. దీంతో.. షాక్‌కు గురైన బ్యాట్స్‌మన్ కాసేపటి వరకూ ఆశ్చర్యం నుంచి తేరుకుని నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.
కరుణరత్నె వికెట్‌తో కలిపి మ్యాచ్‌లో నాలుగో రోజైన శనివారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక విజయానికి 75 పరుగుల దూరంలో నిలవగా.. ఆ జట్టు చేతిలో ఇక మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి.