ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ బుధవారం నిర్వహించిన సమావేశం వాడివేడిగా జరిగింది. మరి కొన్ని నెలల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలం నిబంధనలు ఖరారు చేయడానికి ముంబైలో ఈ మీటింగ్ జరిగింది. అయితే అన్ని ఫ్రాంచైజీలు ఒక నిర్ణయంపై ఏకాభిప్రాయానికి రాలేదు. ఒక్కో ఫ్రాంచైజీ తమ అభిప్రాయాలను భిన్నంగా వెల్లడించాయి. వీటిపై అంతిమంగా బీసీసీఐ తుదినిర్ణయం తీసుకుంది.
కాగా, ఐపీఎల్-బీసీసీఐ సమావేశంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ హాజరయ్యారు. కావ్య మారన్ తన అభిప్రాయాలు స్పష్టంగా వెల్లడించారు. రిటైన్డ్ లిస్ట్ లేదా రైట్ టూ మ్యాచ్ (ఆర్‌టీఎమ్) కార్డ్ విధానాలతో కలిపి మొత్తంగా ఆరుగురు ఆటగాళ్లను తమ ఫ్రాంచైజీతో అట్టిపెట్టుకునే వెసులుబాటు కల్పించాలని పేర్కొన్నారు. అలాగే రిటైన్డ్ లిస్ట్‌లో విదేశీ ప్లేయర్లకు పరిమితి విధించకూడాదని తెలిపారు.

''నలుగురు ఆటగాళ్లను రిటైన్డ్ చేసుకోవడం, ఇద్దరు ప్లేయర్లను ఆర్‌టీఎమ్ ద్వారా సొంతంచేసుకునేలా ఉంచాలి.
లేదా ఆరుగురుని రిటైన్డ్ చేసుకోవడం లేదా ఆరుగురిని ఆర్‌టీఎమ్ ద్వారా ఉంచుకునేలా ఉండాలి. ప్లేయర్‌తో చర్చించి రిటైన్డ్ లేదా ఆర్‌టీఎమ్‌తో వెళ్లాలా అనే నిర్ణయం తీసుకునేలా అవకాశం ఉండాలి. ఓ ప్లేయర్ రిటైన్డ్‌కు ఇష్టపడతారు, మరొకరు ఆర్‌టీఎమ్‌కు ఓకే అంటారు. గతంలో ఇలాంటివి జరిగాయి. ఓ ఆటగాడు రిటైన్డ్ ధరతో అసంతృప్తి చెందకుండా ఉండేలా చేయాలి''
''ప్రతి జట్టు విభిన్నంగా జట్టును నిర్మిస్తాయి. కొన్ని జట్లు ప్రధాన బలాలు భిన్నంగా ఉంటాయి. కొందరికి విదేశీ ఆటగాళ్లు, మరికొందరికి ఇండియన్ క్యాప్డ్ ప్లేయర్లు, ఇక కొందరికి అన్‌క్యాప్డ్ ప్లేయర్లు బలంగా ఉంటారు. మా జట్టులో విదేశీ ప్లేయర్లు బలంగా ఉన్నారు. కాబట్టి క్యాప్డ్/అన్‌క్యాప్డ్/ఓవర్సీస్ ప్లేయర్ల సంఖ్య ఫ్రాంచైజీల ఇష్టానుసారంగా ఉండాలి. పరిమితం చేయకూడదు'' అని కావ్య మారన్ అన్నారు.
అయితే వేలంలో కొనుగోలు చేసిన తర్వాత అందుబాటులో ఉండని విదేశీ ప్లేయర్లను నిషేధించాలని కావ్య మారన్ అన్నారు. ''వేలంలో తీసుకున్న తర్వాత గాయంతో కాకుండా ఇతరత్ర కారణాలతో సీజన్‌కు అందుబాటులో ఉండకపోతే అతన్ని నిషేధించాలి. టీమ్ కాంబినేషన్ కోసం ఫ్రాంచైజీ ఎంతో శ్రమిస్తుంది. ఓ ప్లేయర్ తక్కువ ధరకే సొంతమైన తర్వాత అతను అందుబాటులో ఉండకపోతే అది జట్టు కాంబినేషన్‌పై ఎఫెక్ట్ పడుతుంది. విదేశీ ప్లేయర్లు ఇలా అందుబాటులో లేని సందర్భాలు చాలా ఉన్నాయి'' అని కావ్య మారన్ పేర్కొన్నారు.
హసరంగను ఉద్దేశిస్తూ కావ్య మారన్ ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. గత వేలంలో హసరంగను సన్‌రైజర్స్ రూ.1.5 కోట్లకు దక్కించుకుంది. కానీ గాయం కారణంతో హసరంగ ఐపీఎల్-2024 నుంచి తప్పుకున్నాడు. అయితే వేలానికి ముందు హసరంగకు ఆర్సీబీతో రూ.10 కోట్లు కాంట్రాక్ట్ ఉండేది. కానీ ఆర్సీబీ వదులుకోవడంతో వేలంలోకి వచ్చిన హసరంగ తక్కువ ధర పలికాడు. దీంతోనే అతను గాయం కారణం చెప్పి సీజన్‌కు దూరమయ్యాడని కొందరి వాదన.