కోల్‌కతా: కెఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో టీమిండియాలో చాలా కాలం తర్వాత చోటు దక్కించుకున్న గౌతమ్ గంభీర్‌కు మూడో టెస్టులో కూడా అవకాశాలు లేనట్లే కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమైన ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో ఆడేందుకు యువ ఆటగాడు కరుణ్ నాయర్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) ఎంపిక చేసింది.
రెండో టెస్టులో శిఖర్ ధావన్ ఎడమ చేయికి గాయమైన కారణంగా మూడో టెస్టుకు దూరమవుతున్నాడు. ఈ నేపథ్యంలో తన సొంత మైదానంగా భావించే ఈడెన్ గార్డెన్‌లో అవకాశం దక్కించుకోలేకపోయిన గంభీర్‌కు అవకాశమిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా కరుణ్ నాయర్ జట్టులోకి వచ్చాడు.

రెండో టెస్టులోనే ఆడాల్సిన గంభీర్.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లే ఓపెనర్ శిఖర్ ధావన్ వైపే మొగ్గు చూపడంతో రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీంతో ఈడెన్‌లో ప్రతిష్ఠాత్మక 500వ మ్యాచ్ కు గంభీర్ ఆడలేకపోయాడు.
ఇప్పుడు, రెండో టెస్టులో శిఖర్ ధావన్ గాయపడ్డాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతి ధావన్ వేలికి గాయం చేసింది. దీంతో వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో మూడో టెస్టుకు ధావన్ దూరమయ్యాడు.
అక్టోబర్ 8 నుంచి ఇండోర్ లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. మరి ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత తుది జట్టులో గంభీర్‌కు అవకాశమిస్తారా? లేక కరుణ్ నాయర్‌నే ఆడిస్తారా? అనే సందేహంగా మారింది.
కాగా, మూడు టెస్టుల సిరీస్‌లో రెండు విజయాలతో టీమిండియా సిరీస్‌ను సొంతం చేసుకున్నప్పటికీ ఆ టెస్టును కూడా గెలిచి క్లీన్ స్వీప్ సాధించవచ్చని భావిస్తోంది.