హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాని పోల్చడంపై భారత మాజీ క్రికెటర్ కర్సన్ ఘావ్రి తీవ్రంగా మండిపడ్డాడు. ఈ మధ్య కాలంలో హార్ధిక్ పాండ్యా మ్యాచ్ ఫినిషర్‌గా సక్సెస్ అయినప్పటికీ, అతను అప్పుడే ధోనితో పోల్చదగ్గ మ్యాచ్ ఫినిషర్ మాత్రం కాదని వివరించాడు.
ధోని చేసిన పరుగులు, అనుభవానికి హార్ధిక్ పాండ్యా ఇంకా చాలా దూరంలో ఉన్నాడని గుర్తు చేశాడు. 'దయచేసి మహేంద్రసింగ్ ధోనీతో హార్దిక్ పాండ్యాని పోల్చకండి. అతనికి మంచి భవిష్యత్ ఉంది. ప్రస్తుతానికి హార్దిక్ ఇంకా భారత్ జట్టులో తానేంటో నిరూపించుకునే దశలోనే ఉన్నాడు. కానీ.. ధోనీ అలా కాదు. అతను ఇప్పటికే గత కొన్నేళ్లుగా జట్టులో తానేంటో నిరూపించుకున్నాడు' అని అన్నాడు.

'ఇప్పుడు మ్యాచ్‌లు ఫినిష్ చేయడంలో ధోనీకి ప్రత్యేకంగా పోటీలు పెట్టాల్సిన అవసరం లేదు. హార్దిక్ పాండ్యా కంటే ధోని వెయ్యి రెట్లు నయం. ఈ రోజుకి కూడా కేవలం నాలుగైదు ఓవర్లలోనే ధోని మ్యాచ్‌ని సమూలంగా మార్చే సత్తా ఉన్న క్రికెటర్' అని కర్సన్ ఘావ్రి వివరించాడు. కాగా, రాంచీ వేదికగా ఆసీస్‌తో శనివారం రాత్రి 7 గంటలకు తొలి టీ20 జరగనుంది.