
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం లభించింది. రాహుల్ ద్రవిడ్ కేంద్ర ఎన్నికల కమిషన్ రాయబారిగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాష్ రావత్ మంగళవారం ప్రకటించారు. ఈ ఏడాది మేలో కర్ణాటక శాసనసభకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదలైంది. 224 స్థానాలున్న కర్టాటక శాసనసభకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. మే 12 న అన్ని నిజయోకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించి, మే 15 న ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొంది.
మే 28తో కర్ణాటక శాసనసభ గడువు ముగియనుండగా ఆలోగా ఎన్నికలు నిర్వహించి, కొత్త ప్రభుత్వం ఏర్పడేలా షెడ్యూల్‌ను ఈసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన రాహుల్ ద్రవిడ్‌ను కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాయబారిగా నియమించారు.
ఏ రంగానికి చెందిన సెలెబ్రిటీనైనా ఎన్నికల రాయబారిగా నియమించుకునే అవకాశం ఎన్నికల కమిషన్‌కు ఉంది. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ భారత అండర్-19 క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే రాహుల్ ద్రవిడ్ శిక్షణలో భారత యువ జట్టు న్యూజిలాండ్ వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.