
హైదరాబాద్: టీమిండియా క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వివాదంలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ బాధ్యత కూడా ఉందని మాజీ క్రికెటర్ శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశాంత్ మాట్లాడుతూ "ఒకవేళ షోకు హాజరైన వారు ఎక్కువ ఉత్సాహంతో ఉంటే.. షో హోస్ట్ కరణ్‌కు ఏమైంది?" అని ప్రశ్నించాడు.
"వారు తప్పు మాట్లాడుతుంటే టీవీ హోస్ట్‌గా అడ్డుకోవాల్సిన బాధ్యత అతనిపై లేదా? ఛానెల్ కోసం ఆ వ్యక్తి గురించి అవగాహన లేకుండా ఓ ప్రశ్న అడిగితే, వచ్చిన వారు పరిణితి చెందిన వ్యక్తులు కాకపోతే ఇతరులు బాధపడే వ్యాఖ్యలు చెయొచ్చు. దానికి వ్యాఖ్యాత బాధ్యత కూడా ఉంటుంది. అతను కచ్చితంగా అడ్డుకోవాల్సింది. కాబట్టి ఈ వివాదంలో కరణ్ కూడా భాగస్వామియే" అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.
పాండ్యా, రాహుల్‌లపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్న సందర్భంలో కూడా శ్రీశాంత్ మద్దతు పలికాడు. వారు మాట్లాడింది తప్పేనని, కానీ దాన్ని ఇంత వివాదం చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. "జరిగింది తప్పే. వారు తప్పుగా మాట్లాడారు. ఇంతకంటే పెద్ద తప్పులు చేసిన వారు ఉన్నారు. వారు ఇప్పటికీ ఆడుతూనే ఉన్నారు. క్రికెట్ మాత్రమే కాదు ఇతర రంగాల్లోనూ ఉన్నారు" అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.
'కాఫీ విత్ కరణ్" టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాండ్యా, రాహుల్‌లు నిషేధం కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమైన పాండ్యా, రాహుల్‌లు మళ్లీ ఎప్పుడు క్రికెట్‌లో అడుగు పెడతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ టాక్ షోపై విమర్శలు రావడంతో సంబంధిత ఛానెల్ దాన్ని తొలగించింది.