రోహిత్ శర్మ కెప్టెన్సీ విధానాలపై ప్రపంచకప్ విజేత కపిల్ దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత ప్రధాన అస్త్రం బుమ్రాను రోహిత్ ఆలస్యంగా బరిలోకి దించడంపై తీవ్రంగా తప్పుపట్టాడు. ఈ విషయం గురించి నేరుగా హిట్‌మ్యాన్‌తోనే మాట్లాడతానని కపిల్ దేవ్ చెప్పాడు. టీ20 వరల్డ్ కప్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్ ఆడిన రెండింట్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.
లీగ్ స్టేజ్‌లో భాగంగా న్యూయార్క్ వేదికగా అమెరికాతో ఇవాళ టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ సూపర్-8కు చేరుకుంటుంది. ఐర్లాండ్, పాకిస్థాన్‌పై గెలిచిన ఇండియా నాలుగు పాయింట్లు, +1.455 నెట్ రన్ రేటుతో ప్రస్తుతం టేబుల్ టాప్‌లో ఉంది. అయితే భారత్ విజయాలు సాధించినప్పటికీ బౌలర్లు ఉపయోగించిన రోహిత్ విధానంపై కపిల్ దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పవర్‌ప్లేలోని ఆఖరి ఓవర్‌లో బుమ్రాకు రోహిత్ బంతిని అందించాడు.

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా మూడో ఓవర్‌కు బంతిని అందుకున్నాడు. అయితే పొట్టి ఫార్మాట్‌లో ప్రధాన బౌలర్‌ను ఆలస్యంగా ఉపయోగిండచం సరైన నిర్ణయం కానది కపిల్‌దేవ్ అభిప్రాయపడ్డాడు. బుమ్రాకు ఆదిలోనే బంతిని ఇస్తే వికెట్ల తీసి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తీసుకువస్తాడని అన్నాడు. ''ఈ విషయం గురించి కెప్టెన్ రోహిత్ శర్మను అడుగుతాను. ఆలోచన విధానాలను తెలుసుకోవాలంటే వాళ్ల మధ్య ఉండాలి. మనం బయట నుంచి భిన్నంగా ఆలోచించవచ్చు. అయితే ఏమైనప్పటికీ బుమ్రా తొలి ఓవర్ బౌలింగ్ వేయాల్సిందే''
''వికెట్లు తీసే సామర్థ్యం ఉన్న బౌలర్ బుమ్రా. అలాంటి అతన్ని ఛేంజ్ బౌలర్‌గా అయిదు లేదా ఆరో ఓవర్‌లో బంతిని అందిస్తే మ్యాచ్‌ను చేజార్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇది టెస్టు మ్యాచ్ కాదు. టీ20 ఫార్మాట్. ఆదిలోనే వికెట్లు సాధిస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి బుమ్రాతో రెండు ఓవర్లు స్పెల్ వేయించి వికెట్లు సాధిస్తే ప్రత్యర్థి జట్టు కష్టాల్లో పడుతుంది. అంతేగాక మన ఇతర బౌలర్లకు ఉపశమనంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు బుమ్రా బౌలింగ్‌లో పరుగులు రావొచ్చు. కానీ సానుకూల ధోరణీతో ముందుకు సాగాలి'' అని కపిల్ దేవ్ అన్నాడు. కాగా, భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో బుమ్రానే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు.