ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను తప్పించడంలో అర్థం ఉందా?.. సెలక్టర్లపై కపిల్ దేవ్ ఫైర్!!

ఢిల్లీ: భారత సెలక్టర్లు, జట్టు యాజమాన్యంపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌ను న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంలో ఏమైనా అర్థం ఉందా? అని జట్టు యాజమాన్యంపై ఫైర్ అయ్యారు. ప్రతి మ్యాచ్‌కు జట్టులో ఆటగాళ్లను మార్చడం సమంజసం కాదు. ప్రతీ మ్యాచ్ కోసం జట్టులో మార్పులు చేస్తునే ఉంటారా? అని ప్రశ్నించారు. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా పది వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే.

కివీస్ పుంజుకున్న తీరు అద్భుతం:
ప్రస్తుతం తొలి టెస్టు ఓటమిపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక టీమిండియా తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ టెస్టు ఓటమిపై స్పందిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. 'టీ20 సిరీస్‌లో ఘోర ఓటమి తర్వాత పుంజుకున్న ఆతిథ్య న్యూజిలాండ్ వన్డే సిరీస్, తొలి టెస్టుల్లో అద్భుత ఆటతో ఆకట్టుకుంది. ఓటముల తర్వాత వారు పుంజుకున్న విధానం అద్భుతం. సారథిగా కేన్ విలియమ్సన్ జట్టును ముందుండి నడిపించిన విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది' అని కపిల్ అన్నారు.

ప్రతి మ్యాచ్‌కు కొత్త జట్టా:
'ప్రతి మ్యాచ్‌లోనూ భారత్ కొత్త జట్టుతో బరిలోకి దిగుతోంది. జట్టులో ఏ ఆటగాడికి శాశ్వతంగా స్థానం లేనట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఆటగాళ్లపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇలానే మార్చుకుంటూ వెళ్లడం ద్వారా యువ ఆటగాళ్లకు ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు?. గత కొంతకాలంగా సీనియర్ ఆటగాళ్లు మినహా ఒక్క యువ ఆటగాడినైనా జట్టులో శాశ్వత స్థానం కల్పించారా?. జట్టులో తన స్థానంపై నమ్మకం లేనప్పుడు ఓ ఆటగాడు మెరుగైన ప్రదర్శన ఏలా చేయగలడు?' అని కపిల్ ప్రశ్నించారు.

ఆటగాళ్ల స్థానాలపై భరోసా ఇవ్వాలి:
'బ్యాటింగ్ ఆర్డర్‌లో స్టార్ ఆటగాళ్లు ఉన్నా భారత్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 200 స్కోరుని దాటలేకపోయింది. కివీస్ పరిస్థితులను తట్టుకొని విజయం సాధించలేకపోయింది. కోహ్లీసేన ప్రణాళికపై ఎక్కువగా దృష్టి సారించాలి. నేను ఆడినప్పుడు, ఇప్పుడూ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అత్యుత్తమ జట్టుని తయారుచేయాలంటే.. యాజమాన్యం ఆటగాళ్ల స్థానాలపై భరోసా ఇవ్వాలి. అప్పుడే వారిలో విశ్వాసం రెట్టింపు అవుతుంది' అని కపిల్ సూచించారు.

రాహుల్‌ను తప్పించడంలో అర్థం ఉందా:
'తుది జట్టులో మార్పులు చేస్తూ ఉండటం సరైన ఆలోచన కాదు. జట్టు యాజమాన్యం ప్రతి ఫార్మాట్‌కు ప్రత్యేక జట్టును ఉంచాలని ఆలోచిస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది. లోకేష్ రాహుల్ అసాధారణమైన ఫామ్‌లో ఉన్నాడు. కానీ.. ప్రస్తుతం అతడు జట్టులో లేడు. టీ20, వన్డేల్లో పరుగులు చేసిన ఆటగాడిని పక్కన కూర్చోబెట్టడంలో ఏమైనా అర్థం ఉందా?. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు ఏ ఫార్మాట్‌లోనైనా రాణిస్తారు. ఫామ్‌లో ఉన్న ఆటగాడిని ఆడించడం జట్టుకు, ఆ క్రికెటర్‌కు ఎంతో లాభం' అని కపిల్ చెప్పుకొచ్చారు.

మయాంక్ తప్పితే:
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 165, రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కుప్పకూలింది. రెండు ఇన్నింగ్స్‌లలో మయాంక్ అగర్వాల్ (58) తప్పితే హాఫ్ సెంచరీ చేసిన వాళ్లే లేరు. ఇక ఫిబ్రవరి 29 నుంచి క్రైస్ట్‌చర్చి వేదికగా జరగనున్న రెండో టెస్టులో విజయం సాధించాలని టీమిండియా చూస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications